Mahaa Daily Exclusive

  ఆర్డినెన్స్, జీవోల పేరుతో కాలయాపన..! రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ ధ్వజం..

Share

  • ఆర్డినెన్స్, జీవోల పేరుతో కాలయాపన
  • బీహార్ ఎన్నికల్లో రాజకీయ లాభం కోసం రేవంత్ డ్రామాలు
  • కుల గణన వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు ఉంచలేదు
  • రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ ధ్వజం

 

హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ముఖం బయటపడిందని, ఆ పార్టీకి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆగస్టు 31న అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపి, నిర్ణయానికి ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం చట్టవిరుద్ధ చర్య అన్నారు. అలాగే, కుల గణన వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు ఉంచలేదని, గ్రామాలు మరియు మండలాల వారీగా డేటా ఎందుకు గోప్యంగా పెట్టారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశం న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

 

బీహార్ ఎన్నికల రాజకీయ లాభం కోసమే..

కేవలం బీహార్ ఎన్నికల్లో రాజకీయ లాభం కోసం, రాహుల్ గాంధీ ఒత్తిడికి లొంగి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడారని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్, జీవోల పేరుతో కాలయాపన చేస్తూ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని, చివరికి బీసీ వర్గాలను మరోసారి వంచించిందని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేశామని చెప్పి, కోర్టు తీర్పులను సాకుగా వాడుకుని బీసీల ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. రిజర్వేషన్ల అంశం రాజ్యాంగపరమైన, శాస్త్రీయమైన ప్రక్రియతోనే సాధ్యమని తెలిసినా, కాంగ్రెస్ దానిని పూర్తిగా అపహాస్యం చేసిందన్నారు.

Latest