Mahaa Daily Exclusive

  ఆంధ్ర, తమిళనాడుకు శ్రీలంక శ్రీరామరక్ష.. నిర్ధారించిన ఇన్వాయిస్ ..

Share

హైదరాబాద్, మహా: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతానికి శ్రీలంక రక్షణ కవచంగా నిలు స్తోందా? అంటే ఔననే అంటున్నారు నిపుణులు. బలమైన రాకాసి అలల తాకిడికి ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు నష్టం కలగకుండా శ్రీలంక భూభాగం అడ్డుకుంటున్నట్లు హైదరాబాద్ లోని భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవాకేంద్రం (ఇన్కాయిస్) నిర్ధారించింది. హిందూ మహాసముద్రంలో ఆగ్నేయ దిశగా దూసుకొచ్చే శక్తివంతమైన అలల ప్రభావం ఈ రెండు రాష్ట్రాల తీరాలపై పడకుండా శ్రీలంక భూభాగం నిలువరిస్తున్నట్లు ఇన్కాయిస్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైందని పేర్కొంది. ‘భారత ద్వీపకల్పానికి ఆగ్నేయాన ఉన్న శ్రీలంక భూభాగం సహజ భూఅవరోధంగా పనిచేస్తోంది. దక్షిణ మహాసముద్రంలో ఏర్పడే బలమైన అలల విధ్వంస ప్రభావాల నుంచి దేశ ఆగ్నేయ తీరాన్ని రక్షించడంలో భూభాగం కీలక పాత్ర పోషిస్తోంది. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే శక్తిమంతమైన అలలు మన దేశ నైరుతి తీరంలోని కేరళపై ప్రభావం చూపుతుండగా, శ్రీలంక భూభాగం ప్రభావంతో వాటి తాకిడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై పడటం లేదు’ అని వెల్లడించింది. ఇన్కాయిస్ శాస్త్రవేత్తలు కె.జి. సంధ్య, ఆర్.హరికుమార్, పి. ఎ. ఫ్రాన్సిస్, బాలాజీ బాదురు ఈ పరిశోధనలు చేయగా, మంగళూరు విశ్వవిద్యాలయంలోని మెరైన్ జియాలజీ విభాగం, పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రోలజీ పరిశోధనల్లో పాలుపంచుకున్నాయి. ఈ పరిశోధన పత్రం జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ లో తాజాగా ప్రచురితమైంది’ అని ఇన్కాయిస్ డైరెక్టర్ టి.ఎం.బాలకృష్ణన్ నాయర్ వెల్లడించారు.

 

నిర్ధారణ ఇలా

 

కేరళ తీర ప్రాంతం వరదల కారణంగా కోతకు గురవుతుండగా, శ్రీలంకకు ఉత్తరాన ఉన్న తూర్పుతీరంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఎక్కువగా ప్రభావితం కాలేదు. బలమైన అలలు బంగాళాఖాతంలోకి వ్యాపించినప్పటికీ.. దేశ ఆగ్నేయ తీరంలో వీటి తీవ్రత అతి తక్కువగా ఉంది. దీన్ని నిర్ధారించడానికి ఇన్కాయిస్ శాస్త్రవేత్తలు పశ్చిమ తీరంలోని కేరళలో కొల్లం, తూర్పు తీరంలోని పాండిచ్చేరిలో హైరెజల్యూషన్ వేవ్ వాచ్-9 మోడల్ ను ఉపయోగించి ఆలల తీవ్రత ప్రభావాన్ని విశ్లేషించారు. కొల్లం ప్రాంతంలో వచ్చిన అలలు 96 శాతం కంటే ఎక్కువ పాండిచ్చేరి ప్రాంతానికి చేరుకోలేదని గుర్తించారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా సముద్రమట్టం పెరుగుదల తీరప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపధ్యంలో శ్రీలంక భూభాగం సహజ రక్షణకవచంగా ఉంటూ తూర్పుతీర ప్రాంతంలో కీలకమైన భూభాగాలపై వ్యతిరేక ప్రభావం పడకుండా చూస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Latest