- రైతన్నదే కీలక పాత్ర
- వికసిత్ భారత్ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు
- పప్పులకు సంబంధించిన సాగును మరింత పెంచాలి
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఢిల్లీ, మహా: దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడంలో రైతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే.. కేవలం వరి, గోధుమ పంటల పైనే కాకుండా ప్రొటీన్ అధికంగా లభించే పప్పులకు సంబంధించిన సాగును మరింత పెంచాలని రైతులకు సూచించారు. ప్రపంచ మార్కెట్‌లకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను పండించాలన్నారు. దేశంలో పంటల ఉత్పత్తికి అయ్యే ఖర్చులు తగ్గించి.. రైతుల ఆదాయం పెంచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో వ్యవసాయ రంగంలో కేవలం రూ.5 లక్షల కోట్ల సబ్సిడీలు ఇస్తే.. తమ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు రూ.13 లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు ఇచ్చిందని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అన్ని రంగాల్లో నిరంతరం కొత్త మార్పులు చోటుచేసుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు దేశంలోని 100కు పైగా జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా ప్రకటించి.. ఆపై వాటిని పూర్తిగా మరిచిపోయాయని ప్రధాని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించి, వాటిని ఆశావహ జిల్లాలుగా ప్రకటించినట్లు తెలిపారు.








