Mahaa Daily Exclusive

  అర్వింద్ చిట్టా బయటపెడతాం: కవిత కౌంటర్

Share

  • అర్వింద్ చిట్టా త్వరలో బయట పెడతా
  • ఎంపీ పదవికి రాజీనామా చేస్తే బీసీ బిల్లు అదే వస్తుంది
  • బీజేపీ ఎంపీ అర్వింద్‌కు కల్వకుంట్ల కవిత కౌంటర్
  • బీఆర్ఎస్ ఏకపక్షంగా తనను బయటకు పంపిందని ఆవేదన
  • పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని జనం బాటలో ఎమ్మెల్సీ డిమాండ్

నిజామాబాద్, మహా: ఎంపీ అర్వింద్ రాజీనామా చేస్తే బీసీ బిల్లు అదే వస్తుందని, అతని చిట్టా త్వరలోనే బయట పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ ఏకపక్షంగా తనను బయటకు పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో అన్ని బాధ్యతలకు తాను రాజీనామా చేసి.. మళ్లీ జనం ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. ఎవరి పనితీరు ఏమిటో రివ్యూ చేసుకుని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదని తెలిపారు. జనంబాటకు చాలామంది అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. జనంబాట చేపట్టిన తనపై ఓ ఎంపీ లేనిపోని ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు కవిత. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు కవిత జనంబాట కొనసాగింది. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో కవిత పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను అణచి వేస్తోందని ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ కోసం జనంబాట పట్టానని ఉద్ఘాటించారు. ప్రతీ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపడతానని వివరించారు. మునిగిపోయే పడవ కాంగ్రెస్‌తో తనకేం ఏం సంబంధమని కవిత ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలోని యంచ గ్రామంలో ముంపు ప్రాంతాలను చూశామని చెప్పుకొచ్చారు కవిత.

పోడు రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందే..
అన్నదాతలకి ఎకరానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 70 వేల ఎకరాల్లో మొక్కజొన్న రైతులు దగా పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 80 శాతం మంది రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి సర్కార్ మరోసారి ఆలోచించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో అన్నదాతలు ఒక్కో క్వింటాకు రూ.700 నష్టపోయారని వాపోయారు. ధాన్యం తడిసి చెడిపోయిందని తెలిపారు. ‘తెలంగాణ వచ్చాక మంచిప్ప ప్రాజెక్ట్ పెద్దగా చేసుకోవాలని ప్రయత్నించాం. కానీ అది చేసుకోలేకపోయాం. రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడకు ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టను అని చెప్పారు. అలాంటప్పుడు రైతులకు ఈ భూములను పట్టా చేయాలి. ఇవాళ కాకపోతే రేపైనా రైతులకు పట్టా చేయిస్తాం. ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దని నేను ప్రభుత్వాన్ని, ఇక్కడి మంత్రులను, జిల్లా కలెక్టర్ ను కోరుతున్నా. అదే విధంగా ఇక్కడి 9 తండాలు, 3 గ్రామ పంచాయితీలకు పట్టాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కాళేశ్వరం కట్టబొమని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందే. మిగతా పట్టా ల్యాండ్ ల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. చేతికొచ్చిన పంటపై విషం చల్లటమంటే ఎంత దారుణం? ఎంత అన్యాయం ఇది? రైతు ఎంత ఆగమైతడు? రైతులను పంట కోసుకొనివ్వచ్చు కదా? ఇంత నిరంకుశంగా, కర్కషంగా ప్రభుత్వాలు ఉండటం కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజలను పిల్లల మాదిరిగా చూసుకోవాలి. ఇంత దారుణంగా ఉండటం అన్యాయం. మంచిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులను ఫారెస్ట్ వాళ్లు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు

Latest