- జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
- బీజేపీ మతం పేరుతో ఓట్లు దండుకుంటోంది
- మెట్రోఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినే
- అందరం హైకమాండ్ రాడార్‌లో ఉన్నాం.. లిమిట్స్‌లో ఉండాలి
- మీడియా చిట్ చాట్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెట్స్
- కేసీఆర్‌ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం.. పరిపాలన మాత్రం గాడి తప్పిందని వ్యాఖ్య
ఢిల్లీ, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు మాదే, మంచి మెజారిటీతో గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డంకిగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మెట్రో పనులు చేపట్టేలా ఆయన ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. ఆదివారం ఢిల్లీ వేదికగా మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. కిషన్‌రెడ్డి మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. మెట్రోఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్రెడ్డినేనని ఆరోపించారు. కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుని మెట్రోఫేస్-2 పూర్తి చేయాలని కోరారు. ‘మా ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 46 వేల ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి. ఇది మా బలం,” అని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంగా ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తున్నప్పటికీ, ఓటు చోరీ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలోని అన్ని పరిస్థితులను కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఉంచుకుందని, అందరూ దాని రాడార్‌లో ఉన్నారని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. “మంత్రుల మధ్య గొడవలు ముగిసిన అధ్యాయం. ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి,” అని ఆయన సూచించారు. కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఇటీవల జరిగిన వివాదంపై మాట్లాడుతూ, “కొందరు అలా మాట్లాడకూడదు. పోలీసుల వల్ల కొంత గందరగోళం జరిగింది, అది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే,” అని వివరించారు. ఈ సమస్యలపై హైకమాండ్‌కు రిపోర్ట్ సమర్పించామని తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేలకు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మహేష్ గౌడ్ వెల్లడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. “ఎమ్మెల్యేలు డీసీసీ బాధ్యతలు తీసుకోవడం మంచిది. ఇవి డబుల్ పోస్టులుగా చూడకూడదు,” అని ఆయన అన్నారు. కుటుంబాలు పార్టీలో సేవలు అందిస్తుంటే అడ్డంకి ఉండదని, కానీ ఉన్నపలంగా పదవులు అడిగితే ఇవ్వరని స్పష్టం చేశారు. “రెండు పదవులు ఉండకూడదనే నిబంధన ఉంది. ఒక పదవికి ఎంపికైతే, మరొకటికి రాజీనామా చేయాలి,” అని ఆయన వివరించారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇటీవలి ఘటనలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని మహేష్ గౌడ్ విమర్శించారు. “పార్టీ నియమావళికి అందరూ కట్టుబడి ఉండాలి,” అని ఆయన పేర్కొన్నారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ మధ్య గురు-శిష్య బంధం గురించి మాట్లాడుతూ, పార్టీ ఆదేశాలకు లోబడి నడవాలని సూచించారు. బీజేపీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “బీజేపీ ఎప్పుడూ మతం, కులం పేరుతో ఓట్లు దండుకుంటుంది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారు? కేంద్ర మంత్రిగా బండి సంజయ్ చిల్లరగా మాట్లాడారు,” అని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరైన సహకారం లభించడం లేదని, మెట్రో ఫేస్-2 ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ, తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు పంపినట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన సూచనలు సమర్పించారని తెలిపారు. “రాజకీయాలు ఎన్నికల వరకే. అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి,” అని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం కాంగ్రెస్ సంస్కృతి కాదని, మాగంటి కుటుంబ విషయాలు మీడియా ద్వారానే తెలిసాయని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అధికారులు, మంత్రులు జవాబుదారీగా ఉండాలని ఆయన సూచించారు








