- ఎర్రకోట ఘటన వెనుక భారీ కుట్ర
- దేశంలో భారీ పేలుళ్ళకు జైషే ప్లాన్
- పహల్గాం ప్రతీకారానికి భారత్ పై ఉగ్ర సంస్థ గురి
- విచారణలో తవ్విన కొద్దీ వెలికి వస్తున్న అనేక అంశాలు
- వేర్వేరు కోణాల్లో దర్యాప్తును సాగిస్తున్న భద్రతా సంస్థలు
- దేశాన్ని అతలాకుతలం చేయాలన్నది వారి లక్ష్యమంటున్న దర్యాప్తు సంస్థలు
- మున్ముందు భారీ అరెస్టులుండవచ్చని సంకేతాలు
- సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
- 200 ఐఈడీలతో 26/11 తరహా కుట్రకు ప్లాన్
మహా : సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన వెనుక ఉగ్రవాదుల పెద్ద కుట్ర బయటపడుతోంది. దర్యాప్తు అధికారులు తవ్వే కొద్దీ ఘటనకు సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు వెనక జైషే మహ్మద్ ముఠాకు సంబంధాలున్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన దర్యాప్తు సంస్థలు ఉగ్రవాదులు 26/11 ముంబయి దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు పథక రచన చేసినట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల లక్ష్యంలో లక్ష్యంలో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి ప్రముఖ కట్టడాలతో పాటు అయోధ్యలోని రామాలయం, వారణాసిలోని కాశీ ిశ్వనాథ దేవాలయంతో పాటు మరిన్ని కీలక ప్రదేశాలున్నట్లు గుర్తించారు. ఎర్రకోట వద్ద జరిగిన క్షణాలలో అక్కడకు చేరుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు సంఘటన ప్రాంతాల్లోని ప్రతి అణువును క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాల కోసం జల్లెడ పడుతున్నారు. దీంతో పాటు ఘటన స్థలంలోని సీసీ కెమెరాలతో పాటు పరిసర ప్రాంతాలలోని సీసీ కెమెరాలను కూడా వడపోస్తున్నారు. ఈ దిశలో కొంత పురోగతి సాధించిన అధికారులు కుట్ర వెనుక ప్రధాన సూత్రదారులను కూడా గుర్తించారు. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అదుపులో ఉన్న వారిని ప్రశ్నించిన అధికారులకు దిమ్మతిరిగే సమాచారం లభించినట్లు తెలుస్తోంది. దాడి వెనుక పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మహ్మద్ ఉగ్ర ముఠా ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. వైద్యుల టెర్రర్ మాడ్యూల్‌గా పిలుస్తున్న ఈ గ్రూప్ దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా విధ్వంసకర దాడులకు సిద్ధమవుతోందని అధికార వర్గాలు తెలిపాయి.
దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం, టెర్రర్ మాడ్యూల్ జనవరి నెల నుంచే పథకం ప్రకారం పనిచేస్తోందని బహిర్గతమైంది. అత్యంత శక్తివంతమైన సుమారు 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తేలింది. వీటిని ఉపయోగించి దిల్లీలోని ముఖ్య ప్రాంతాలతో పాటు యూపీలోని పలు కీలక ప్రాంతాలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద భారీ పేలుళ్లకు పన్నాగం పన్నారు. ఈ ఉగ్రవాద ముఠా కేవలం రాజధానికే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వరుస దాడులకు సిద్ధమవుతోందని సమాచారం. ఇందుకోసం కొన్ని ప్రాంతాలలో రెక్కీకూడ నిర్వహించినట్లు తేలింది. టెర్రర్ నెట్‌వర్క్‌పై ఇటీవల జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా చేసిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటివి సీజ్ చేశారు. ఈ పరిమాణం ద్వారా ఉగ్రవాదులు పెద్ద స్థాయిలో దాడులకు సిద్ధమైనట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పహల్గాం దాడి తర్వాత భారత దేశం పాక్ సరిహద్దులలోని టెర్రర్ స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న పాకిస్తాన్ జైషే మహ్మద్ సంస్థకు కావాల్సిన నిధులు, పేలుడు సామాగ్రిని సమకూర్చి భారతదేశఁలోని పలు కీలక ప్రాంతాలలో పేలుళ్ళకు పాల్పడటంతో పాటు భారీ ఎత్తున ప్రాణనష్టం సంబవించేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని ఆదేశించినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన ప్రదేశం నుంచి ఫోరెన్సిక్ నిపుణులు దాదాపు 40 నమూనాలను సేకరించి వాటిని వాటిని విశ్లేషించగా అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లు లభించాయని, అదనంగా మరొక అత్యంత శక్తిమంతమైన పేలుడు పదార్థం కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ పేలుడు పదార్ధం ఏమిటన్నది తేల్చే పనిలో ఫోరెన్సిక్ టీం ఒకటి నిమగ్నమైంది. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుపై నిగ్గుతేల్చేందుకు 10 మంది అధికారుల బృందం పని చేస్తోంది. ఉగ్ర కోణం జమ్మూలోనూ బహిర్గతం కావడంతో జమ్మూకశ్మీర్, దిల్లీ, హరియాణా పోలీసుల నుంచి కేసు వివరాలను సేకరించి, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తోంది. నిందితుల ఆర్థిక లావాదేవీలు, విదేశీ ఫండింగ్ మూలాలు, వారిని వెనక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరన్నది తేల్చే పనిలో అధికారులున్నారు. జైషే అహ్మద్ నెట్ వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించిన దృష్ట్యా, గతంలో ఉగ్రమూలాలు బయటపడిన ప్రాంతాలు, తాజాగా దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ప్రాంతాలలో నిఘాను తీవ్రం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధక చర్యలపై చర్చించనున్నట్లు ఐబీ అధికారులతోనూ దర్యాప్తు సంస్థలు చర్చిస్తున్నాయి.
హర్యానాకు ప్రత్యేక టీం
అల్ ఫలాహ్ యూనివర్సిటీలో సోదాలు
ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు హర్యానాలోని ‘అల్ – ఫలాహ్’ వైద్య కళాశాలలో సోదాలను నిర్వహించారు. ప్రతిష్ఠాత్మక జామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కన్పించిన అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఇప్పుడు ఉగ్ర కుట్రలకు కేంద్రబిందువుగా మారడంపై కేంద్ర సంస్థలు ఆఁదోళన వ్యక్తం చేస్తున్నాయి. వైద్యులు, టీచర్ల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారన్న అనుమానాలను దర్యాప్తు సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన కారును డాక్టర్ ఉమర్ నబీ, అల్-ఫలాహ్ యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తు చేస్తున్నాయి. అంతేకాకుండా ఇదే యూనివర్సిటీకి చెందిన మరో ఇద్దరు డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, షాహీన్ షాహిద్‌ను 2,900 కిలోల పేలుడు పదార్థాల కేసులో పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఈ యూనివర్సిటీపై దృష్టిసారించిన దర్యాప్తు అధికారులు అక్కడ విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఉమర్, ముజమ్మిల్ నివాసం ఉండే గదులను తనిఖీ చేయడంతో పాటు యూనివర్సిటీలోని కొంతమంది వైద్యులు, సిబ్బందిని కూడా ప్రశ్నించారు. మరోవైపు హర్యానాలోని మేవాత్‌కు చెందిన మౌల్వీ ఇష్తియాక్ అనే మత ప్రచారకుడిని టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధించి జమ్ముకశ్మీర్ పోలీసులు శ్రీనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కూడా అల్-ఫలాహ్ యూనివర్సిటీ సముదాయంలో అద్దె ఇంట్లో ఉంటున్నట్టు అధికారులు గుర్తించారు.
అల్-ఫలాహ్ వైద్యకళాశాలలో టెర్రర్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేసిన ప్రధాన సూత్రధారి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్‌ను అరెస్టు చేసిన జమ్ముకశ్మీర్ పోలీసులు అతడి నుంచి కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. అల్ ఫలాహ్ కళాశాలలో చదువుతున్న వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోయడంలో ఇమామ్ అర్ఫాన్ అహ్మద్ కీలక పాత్ర పోషించినట్లు జమ్ముకశఅమీర్ పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్, ఫరీదాబాద్‌లోని వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసినట్లు, జైషేకు సంబంధించిన వీడియోలను పదేపదే విద్యార్థులకు చూపించినట్లు బయటపడింది. మొత్తం ఉగ్రవాద మాడ్యూల్‌ను ఇర్ఫాన్ రూపొందించాడని, ఈ మాడ్యూల్ బయటపడిన నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ ఢిల్లీ పేలుడుకు కారణమైనట్లు దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.








