- దేశానికి దారి దీపంలా తెలంగాణ ఆవిష్కరణలు
- రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
- ‘ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు- 2025’ కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, మహా: తెలంగాణ ఆవిష్కరణలలో భారతదేశానికి దారిదీపంలా నిలిచిందని రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మన తెలుగు టెక్నాలజీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక మార్పులకు దారి తీస్తున్నారని కొనియాడారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎంఈఐఎల్ డైరెక్టర్, సేవా కార్యక్రమాల ప్రముఖురాలు సుధా రెడ్డి, ప్రపంచ తెలుగు ఐటీ సదస్సు (డబ్ల్యూటిఐటిసి) ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా కలిసి ‘ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు- 2025’ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని టి-హబ్‌లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డబ్ల్యూటీఐటీసీ- 2025 దుబాయ్ కాన్ఫరెన్స్ మన గ్లోబల్ ప్రతిభ, ఇన్నోవేషన్, కొలాబరేషన్‌కు వేదికగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు ఐటీ మిషన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. డిసెంబర్ 12–14, 2025 తేదీలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరగనున్న ఈ అంతర్జాతీయ ఐటీ మహాసభల్లో 100 కంటే ఎక్కువ దేశాల తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, ఇన్నోవేటర్లు పాల్గొననున్నారు.
డబ్ల్యూటీఐటీసీ ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ.. టి-హబ్‌లో ఈ కౌంట్‌డౌన్ ప్రారంభంతో, చారిత్రాత్మక గ్లోబల్ ఈవెంట్ కోసం మా పనులు తుది దశకు చేరాయని అన్నారు. డబ్ల్యూటీఐటీసీ- 2025లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నాలజీ నిపుణులు, ఇన్నోవేటర్లు, ఇన్వెస్టర్లు ఒక్క జెండా కింద ఏకమవుతారని అభిప్రాపడ్డారు. ఇది గ్లోబల్ టెక్ కథనాన్ని కొత్త దిశలో మలుస్తుందని అన్నారు. దుబాయ్ ఎడిషన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బ్లాక్‌చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి కీలక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ టెక్నాలజీ, స్టార్టప్, ఇన్నోవేషన్ ప్రాధాన్య కార్యక్రమాలను సంయుక్తంగా ప్రదర్శించనున్నాయి.








