Mahaa Daily Exclusive

  ప్రజల సొమ్ము దోచుకుంటే శిక్ష తప్పదు:మహేష్ కుమార్ గౌడ్

Share

ప్రజల సొమ్ము దోచుకుంటే శిక్ష తప్పదు
కక్ష సాధింపు లేదు.. అలా చేస్తే కేసీఆర్, కేటీఆర్ జైల్లో ఉండేవారు
కేటీఆర్ కడిగిన ముత్యమో కాదో త్వరలో తెలుస్తుంది
కాళేశ్వరం విచారణ ఆలస్యంపై బీజేపీ సమాధానం చెప్పాలి
టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్

హైదరాబాద్, మహా:కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడదని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒకవేళ అలా చేసి ఉంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఇప్పటికే జైల్లో ఉండేవారని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రజల సొమ్ము ఎవరు తిన్నా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఎవరిని అడిగి ప్రజలకు సంబంధించిన కోట్ల రూపాయలను కేటీఆర్ బదిలీ చేశారని ఆయన ప్రశ్నించారు. గురువారం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, మోదీ, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకొని ఉంటే, గవర్నర్ అనుమతి 6 నెలల ముందే వచ్చేది కదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిన తర్వాతే గవర్నర్ దిమ్మ తిరిగి అనుమతి ఇచ్చారని వ్యాఖ్యానించారు.

బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీపై మండిపాటు
42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా చిత్తశుద్ధితోనే ఉందని, ఈ విషయాన్ని బీసీ సంఘాలు గ్రహించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. తనకు చట్టపరంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్లాలని ఉన్నా, కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే పార్టీ పరంగా ఇచ్చి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌కు అవకాశం ఉన్నా బీసీ రిజర్వేషన్లు కల్పించడం లేదని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్‌కి ఏమీ తెలియదని, ఎందుకు 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్‌లో పెట్టడం లేదో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ అసలు చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు గవర్నర్ అనుమతి ఎందుకు ఆలస్యం అయిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

అవినీతిపై చట్టం తన పని తాను చేస్తుంది..
తమకు కక్ష సాధింపు లేదని, అలా అనుకుంటే అరెస్టులు మొదట్లోనే ఉండేవని మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. విచారణ చట్ట ప్రకారమే ఉంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించామని, సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల కోట్లు అవినీతి జరిగింది అని బీజేపీ నాయకులే చెప్పారని, మరి సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాను ఇష్టారీతిలో పంచుకోవాలని రాజ్యాంగం చెప్పిందా అని నిలదీశారు. తన మనుషులకు ప్రజల సొమ్మును ఇష్టారీతిలో పంచుకున్నారు, చూస్తూ ఊరుకోబోమని అన్నారు. కేటీఆర్ కడిగిన ముత్యంగా లోపలే ఉంటారో బయటికి వస్తారో త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీనే అని ఆరోపించారు. ఆర్డినెన్స్ తెచ్చినా, 9వ షెడ్యూల్‌లో ఎందుకు కేంద్రం చేర్చలేదో చెప్పాలని కోరారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేసిందని, పంచాయతీ ఎన్నికలతో బీసీ 42 శాతం రిజర్వేషన్ల పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు .

Latest