- సన్నబియ్యం పంపిణీలో తెలంగాణ మోడల్
- దేశంలో ఎక్కడా లేని విధంగా సరఫరా చేస్తున్నాం
- దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి జోషితో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ
హైదరాబాద్, మహా: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి జోషితో ముఖ్యమంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వివరించారు. ప్రజలు తినే బియ్యం సరఫరా చేసినప్పుడే ఆ సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి సూచనపై స్పందించిన కేంద్ర మంత్రి..
తెలంగాణలో అమలు చేస్తున్నట్టుగా దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో అవసరమైతే సమగ్రంగా అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి సూచనపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పూర్తి స్థాయి అధ్యయనం జరిపిన తరువాత దేశ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








