హైదరాబాద్, మహా: ఆటో కిరాయి విషయంలో జరిగిన ఘర్షణలో ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను శంషాబాద్ రూరల్ పోలీసులు 24 గంటలలోపే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్కూడ వద్ద సమీర్ దాస్ తన అల్లుడు పింటూ హతి, స్నేహితులతో పాతబస్తీకి వెళ్లడానికి ఆటో డ్రైవర్ రూ. 800 కిరాయి అడిగాడు. అయితే, సమీర్ దాస్ రూ. 500 మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఘర్షణ తలెత్తింది. ఆగ్రహించిన ఆటోలో ఉన్న నిందితులు సమీర్ దాస్‌పై ఎయిర్ గన్‌తో కాల్చగా ఆయన కడుపులో గాయమైంది. మిగిలిన వారిని కూడా చంపేస్తామని బెదిరించడంతో బాధితులు పారిపోయారు. సమీర్ దాస్ ఫిర్యాదు మేరకు ఈ కేసును సవాలుగా తీసుకున్న రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేశారు. నిందితులైన పసుముల అలియాస్ గుడుల చందు గౌడ్, సహకరించిన తూర్పాటి కృష్ణ అలియాస్ రామును అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఎయిర్ గన్ మరియు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన బృందాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.
=======








