- టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌లో తెలంగాణ దూకుడు
- పెట్టుబడిదారులకు ప్రజా ప్రభుత్వం భరోసా ఇస్తోంది
- టెక్నాలజీ-సాంస్కృతిక కలయికతో దేశాభివృద్ధి: సీఎం రేవంత్
- హైదరాబాద్‌లో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయం
- ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ ‘అనుబంధ భవన సముదాయం’కు ఉచిత స్థలం
- ‘సంస్కృతుల సంగమం – సమృద్ధికి సోపానం’ ఉత్సవాల్లో సీఎం రేవంత్ కీలక ప్రకటన
హైదరాబాద్, మహా: తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ ‘అనుబంధ భవన సముదాయం’ నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు (అస్సాం, అరుణాచల్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర) తమ సొంత భవనాలను నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ భవనాలు ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు వసతి, ఆహారం, కళలు, చేతి వృత్తులు, సంస్కృతుల ప్రదర్శనకు వేదికలుగా పనిచేస్తాయి. దేశంలో మొట్టమొదటి “నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని” విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నాయకత్వం వహించాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు 8 రాష్ట్రాలతో కలిసి సమిష్టిగా పని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఫ్యూచర్ సిటీలో మొట్టమొదటి అనుబంధ కేంద్రం..
తెలంగాణ – నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ఆధ్వర్యంలో ‘సంస్కృతుల సంగమం – సమృద్ధికి సోపానం’ పేరుతో ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ – ఈశాన్య రాష్ట్రాల మధ్య కళలు, సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఆవిష్కరణల వంటి అంశాల్లో నిరంతర సహకారం, పరస్పర అవగాహన కోసం ఈ ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆయన సతీమణి సుధా దేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. త్రిపుర రాష్ట్రానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా, తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా పనిచేయడం వల్ల ఇప్పటికే రెండు ప్రాంతాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలు మరింత సహకారానికి, ప్రజల మధ్య సంస్కృతుల మార్పిడికి నాంది అని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఐటి, ఫార్మా, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, ఆతిథ్యం, స్టార్టప్, క్రీడలు వంటి అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలు విజన్‌లో..
హైదరాబాద్, తెలంగాణ ఇప్పటికే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బృహత్ ప్రణాళికలతో డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు గవర్నర్ నుంచి సంపూర్ణ సహకారం, మద్దతును కోరుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడానికి తెలంగాణ – నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ప్రతినిధుల సహకారం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్సవాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కె. రామకృష్ణారావు, తెలంగాణ డిజిపి బి. శివధర్ రెడ్డితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
====================








