Mahaa Daily Exclusive

  గాంధీ కుటుంబాన్ని వేధిస్తే ఊరుకోం:సీఎం

Share

  • గాంధీ కుటుంబాన్ని వేధిస్తే ఊరుకోం
  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్ స్ట్రాంగ్ మెసేజ్
  • ఓట్ చోరీ అంశంపై దృష్టి మరల్చేందుకే ఇందంతా
  • దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత గాంధీ కుటుంబానిది
  • సంక్షేమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లండి.. డీసీసీ చీఫ్‌లకు సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్, మహా: టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అధ్యక్షుల బాధ్యతపై గట్టి హెచ్చరిక చేశారు. “జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత; నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు” అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా కోటి మందికి కోటి చీరల పంపిణీ (ఇందిరమ్మ చీరలు) కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదేనని అన్నారు. డిసెంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ, మార్చి నాటికి పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరల పంపిణీ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. సంక్షోభంలో రాష్ట్రాన్ని చేపట్టి, ఇప్పుడు సంక్షేమం వైపు నడిపిస్తున్నామని, ఈ పరిపాలనపై గ్రామ గ్రామాన చర్చ పెట్టాలని సూచించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదేనని కొనియాడుతూ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన నేషనల్ హెరాల్డ్ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు.

రాష్ట్ర భవిష్యత్తుపై తన విజన్‌ను వెల్లడిస్తూ, 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా, కోర్ అర్బన్ సమస్యలకు ‘క్యూర్’ (కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ వైపు తరలించడం), పెరీ అర్బన్ రీజియన్‌లో పరిశ్రమలకు ‘ఫ్యూర్’, రీజనల్ రింగ్ రోడ్ బయట వ్యవసాయాభివృద్ధికి ‘రేర్’ వంటి కొత్త విధానాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీని అత్యుత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 7న ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అలాగే, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తామని తెలిపారు. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నామని చెబుతూ, మనం చేస్తున్న పనులు, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉద్ఘాటించారు. రాజకీయాల్లో ఇబ్బందులు సహజమని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.

Latest