Mahaa Daily Exclusive

  ‘సర్‌’పై చర్చకు కేంద్రం అంగీకారం: లోక్‌సభలో వాడివేడీ డిబేట్‌

Share

  • ‘సర్‌’పై చర్చకు సై..
  •  అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
  • 9న లోక్‌సభలో డిబేట్‌.. వాడివేడీగా చర్చలు
  • డిసెంబర్‌ 8న వందేమాతరంపై, 9న ఎన్నికల సంస్కరణలపై డిస్కషన్

 

ఢిల్లీ, మహా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చించేందుకు అధికార పక్షం అంగీకరించింది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో మంగళవారం సమావేశమైన అనంతరం కాంగ్రెస్‌ నేత కె.సురేశ్‌ వెల్లడించారు. డిసెంబర్‌ 8న వందేమాతరంపై, 9న ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ జరగనున్నట్లు తెలిపారు. అయితే తొలిరోజే ‘సర్‌’పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ ఆందోళనల మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై చర్చకు విపక్షం పట్టుబట్టి చివరకు వాకౌట్‌ చేసింది. చర్చకు ప్రభుత్వం విముఖం కాదని, కాలపరిమితిని నిర్దేశించాలనుకోవడం మాత్రం తగదని అధికారపక్షం పేర్కొంది.

 

ఓట్ చోరీ, గ‌ద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల..

ఇక ఓట్ చోరీ, గ‌ద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. లోక్‌సభలో గందరగోళంతో స్పీకర్‌ ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ పునఃప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. చేసేది లేక స్పీకర్‌ సభను నేటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై చర్చ కోరుతూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సభ్యుల డిమాండ్ కు ఒప్పుకోకపోవడంతో సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆ తర్వాత సభలో కొన్ని అంశాలపై విపక్షాలు లేకుండానే చర్చించారు. తర్వాత రాజ్యసభను కూడా రేపటికి వాయిదా వేశారు. రేపటి నుంచి కూడా ఉభయసభలు సజావుగా సాగే అవకాశం లేకపోవడంతో స్పీకర్‌ ఓంబిర్లా విపక్ష పార్టీల ప్రతినిధులతో పార్లమెంట్‌ హౌస్‌లోని స్పీకర్‌ చాంబర్‌లో చర్చించారు. చివరకు కేంద్ర ప్రభుత్వం సర్ పై చర్చకు అంగీకరించడంతో రేపటి సమావేశాలపై ఆసక్తి నెలకొంది.

=====================

Latest