Mahaa Daily Exclusive

  తెలంగాణ ‘భవిష్యత్ బ్లూప్రింట్’ సిద్ధం

Share

  • తెలంగాణ ‘భవిష్యత్ బ్లూప్రింట్’ సిద్ధం
  • 8, 9 తేదీల గ్లోబల్ సమ్మిట్‌పై పకడ్బందీ ప్లాన్!
  • ఏర్పాట్లపై అధికారులతో డిప్యూటీ సీఎం విస్తృత సమీక్ష

హైదరాబాద్, మహా: డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్’ను సందర్శించారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్ రూపుదిద్దుకునే ఈ కీలక కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పురోగతితో పాటు, ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై భట్టి విక్రమార్క వివరంగా చర్చించారు. సమ్మిట్ విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటైన పలు కమిటీల పనితీరు, బాధ్యతలు, ఇప్పటి వరకు పూర్తయిన పనితీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు.

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం ప్రత్యేక సమీక్ష..
సమ్మిట్ కోసం ఏర్పాటు చేసిన ఇన్విటేషన్, హాస్పిటాలిటీ, వేదిక, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్, ప్రోగ్రామ్ నిర్వహణ, కల్చరల్ ఈవెంట్స్, కమ్యూనికేషన్, డిజిటల్ మీడియా కమ్యూనికేషన్ వంటి కీలక విభాగాల కమిటీ అధ్యక్షులు, టీమ్ సభ్యులతో డిప్యూటీ సీఎం ప్రత్యేక భేటీలు నిర్వహించి, ప్రతి విభాగంలో జరుగుతున్న పనిని విడివిడిగా సమీక్షించారు. అనంతరం, వార్ రూమ్‌లో పనిచేస్తున్న ప్రతి బృంద సభ్యుల వద్దకు స్వయంగా వెళ్లి, వారి పనితీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వసతి ఏర్పాట్లు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం, నాణ్యత, స్పష్టతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి గత కొన్ని రోజులుగా వరుసగా వార్ రూమ్‌కు వచ్చి పర్యవేక్షిస్తుండగా, రేపటి నుంచే రాష్ట్ర మంత్రులు కూడా వార్ రూమ్‌ను సందర్శించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Latest