Mahaa Daily Exclusive

  గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలో రోల్ మోడల్ గా నిలుస్తుంది….

Share

  • గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలో రోల్ మోడల్ గా నిలుస్తుంది
  • అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ
  • స‌మ్మిట్ ఏర్పాట్లను ప‌రిశీలించి అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల‌ను మంత్రి శనివారం పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ స‌మ్మిట్‌కు దేశ‌విదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష‌గుర్తింపు పొందిన దిగ్గ‌జాలను ఆహ్వానించ‌డం జ‌రిగింద‌న్నారు. గ‌డ‌చిన రెండు సంవ‌త్స‌రాల‌లో చేప‌ట్టిన అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తోపాటు 2037 విజ‌న్‌, 2047 విజ‌న్ ఈ రెండు సెక్టార్ల‌కు సంబంధించిన ప్ర‌భుత్వ లక్ష్యాలు, ఆలోచ‌న‌ల‌ను ఈ స‌మ్మిట్‌లో వివ‌రించ‌బోతున్నామన్నారు. ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల మేర‌కు స‌మ్మిట్ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింద‌ని, గ‌డువులోగా పూర్తిస్ధాయి ఏర్పాట్ల‌కు ముమ్మ‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రగతి దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ఇందిర‌మ్మ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌ణాళికాబ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవ‌స్ధను ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మీగా వృద్ది సాధించాల‌నే లక్ష్యంతో ప‌నిచేస్తున్నామని, 2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యం సాధించాల‌ని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంద‌న్నారు. స‌మ్మిట్‌పై ఇండిగో విమానాల ర‌ద్దు ప్ర‌భావం ఏమాత్రం చూప‌ద‌ని సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై ఎప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చే అతిధుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌రిశీస్తున్నార‌ని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.

Latest