Mahaa Daily Exclusive

  మేడారం స్వస్తిక చిహ్నంపై వివాదం….

Share

* మేడారం స్వస్తిక చిహ్నంపై వివాదం.
* తిరగబడిన స్వస్తిక మా ఆదివాసీ ఆచారం.
* ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆ గుర్తు సరైనదే.
* మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ నిర్మాణంలో ఈ గుర్తును అపసవ్య దిశలో అంటే తిరగవేసి ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివాసీ ఆచారాలకు ఉన్న ప్రాముఖ్యతను వివరించింది.
రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క మంగళవారం మేడారంలో పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వస్తిక గుర్తుపై జరుగుతున్న ప్రచారాన్ని సీతక్క ఖండించారు. మేడారంలో తిరగబడిన స్వస్తిక గుర్తు విషయంలో ఎవరూ తప్పుడు ప్రచారం చేయవద్దని ఆమె కోరారు. గిరిజన సంప్రదాయాలు లోకరీతికి భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే శతాబ్దాలుగా తమ పూర్వీకుల నుంచి ఈ గుర్తునే పూజిస్తున్నామని స్పష్టం చేశారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమని గుర్తు చేస్తూ అందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. గిరిజన సంస్కృతిలోని వైవిధ్యాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా కోరారు.
వచ్చే ఏడాది నిర్వహించనున్న మహాజాతర కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. తొలుత వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న మంత్రులు జాతర పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమయం తక్కువగా ఉన్నందున పనుల్లో వేగం పెంచుతూనే నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Latest