Mahaa Daily Exclusive

  బంగ్లాదేశ్‌లో ఆగని మతోన్మాద వికటాట్టహాసం: హిందూ గృహాలపై దాడులు.. ప్రాణభయంతో కంచెలు దాటుతున్న బాధితులు

Share

* బంగ్లాదేశ్‌లో ఆగని మతోన్మాద వికటాట్టహాసం.

* చట్టోగ్రామ్‌లో హిందూ గృహాలపై దాడులు

* ప్రాణభయంతో కంచెలు దాటి పరారైన బాధితులు.

* ఈ ఏడాదిలో 258 దాడులు.. 27 మంది మృతి.

*  బంగ్లాదేశ్‌లో పెచ్చరిల్లుతున్న అరాచకం

ఢిల్లీ, మహా.

బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాక వర్గాలపైన జరుగుతున్న అకృత్యాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. తాజాగా చట్టోగ్రామ్ ప్రాంతంలోని జయంత్ సంగా, బాబు సుకిశిల్ అనే వ్యక్తుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని దుండగుల సమూహం విరుచుకుపడింది. బాధితులు ఇస్లాం వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారనే నెపంతో ఆ మూక దాడికి ప్రయత్నించింది. అప్రమత్తమైన బాధితులు ఇంటి వెనుక వైపున ఉన్న ఇనుప కంచెను కోసి అక్కడి నుండి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

బాధితులు చిక్కకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన దుండగులు వారి గృహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ నివాసాలలో ఉన్న వస్తువులను చిందరవందర చేస్తూ భీభత్సం సృష్టించారు. ఈ క్రమంలోనే అక్కడ పెరుగుతున్న మూగజీవాలను సైతం దారుణంగా ప్రాణ తీశారు. వారి క్రూరత్వానికి ఇది పరాకాష్టగా నిలిచింది. దాడి జరిగిన ప్రదేశంలో అల్లరిమూకలు ఒక హెచ్చరిక పత్రాన్ని విడిచివెళ్లారు. ఆ పత్రంలో బెంగాలీ భాషలో రాస్తూ “ఈ ప్రాంతంలోని హిందువుల కదలికలను గమనిస్తున్నాం. వెంటనే మీ పద్ధతులు మార్చుకోవాలి. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని పేర్కొన్నారు. బాధితుల ఆస్తులను, వ్యాపారాలను సైతం నాశనం చేస్తామని, తమ నుండి ఎవరూ రక్షించలేరని భయభ్రాంతులకు గురిచేశారు.

ఈ ఏడాది ప్రారంభం నుండి ఆ దేశంలో సుమారు 258 దాడులు చోటుచేసుకోగా 27 మంది మరణించారు. మరణించిన వారిలో అత్యధికులు హిందూ మతస్థులే కావడం గమనార్హం. గతంలో దీపు చంద్రదాస్ అనే యువకుడిని చిత్రహింసలు పెట్టి చంపిన ఘటనను మరువకముందే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ పరిణామాలపైన భారతదేశంలో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Latest