* ఎక్సైజ్ శాఖలో పదోన్నతుల జాతర.
* 53 మంది అధికారులకు ప్రమోషన్లు.
* డీపీసీ గ్రీన్ సిగ్నల్, త్వరలో ఉత్తర్వులు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఈ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 53 మంది అధికారులకు ప్రమోషన్లు కల్పించేందుకు మార్గం సుగమమైంది. 2025 ముగింపు దశలో ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పరిపాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ పదోన్నతులపై తుది నిర్ణయం తీసుకోగా, ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.
ఈ పదోన్నతుల జాబితాలో మొత్తం 23 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 14 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 12 మంది డిప్యూటీ కమిషనర్లతో పాటు అడిషనల్ మరియు జాయింట్ కమిషనర్ హోదా అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ స్థాయిలో సమగ్రంగా పదోన్నతులు కల్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఏళ్ల తరబడి ఒకే హోదాలో మగ్గిపోతున్న అధికారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. ఈ ప్రమోషన్ల ద్వారా శాఖలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులు భర్తీ కావడంతో పాటు పాలనలో వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
గతంలో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధానంగా క్షేత్రస్థాయి తనిఖీ అధికారాల అంశం అడ్డంకిగా మారింది. డిప్యూటీ కమిషనర్ హోదా వరకు మాత్రమే తనిఖీలు చేసే అధికారాలు ఉండటంతో, అంతకంటే పై హోదాలకు వెళ్తే ఆ పవర్స్ కోల్పోతామనే భయంతో కొందరు అధికారులు గతంలో ప్రమోషన్లను నిరాకరిస్తూ లేఖలు ఇచ్చారు. దీనివల్ల కిందిస్థాయి అధికారుల కెరీర్ వృద్ధి కూడా స్తంభించిపోయింది. అయితే ప్రభుత్వం తాజాగా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఉన్నత స్థాయి అధికారులకు కూడా తనిఖీ బాధ్యతలపై స్పష్టతనిస్తూ ఈ సమస్యకు ముగింపు పలికింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎక్సైజ్ శాఖ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.








