* తైవాన్ తీరంలో భారీ భూకంపం.
* రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు.
* తైపీలో ఊగిన భవనాలు, స్వల్పంగా నిలిచిన రైలు సర్వీసులు
ఢిల్లీ, మహా.
తైవాన్ దేశంలో బుధవారం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైన ఈ భూప్రకంపనలు ద్వీపదేశాన్ని ఒక్కసారిగా వణికించాయి. తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం తూర్పు తైవాన్‌లోని టైటుంగ్ కౌంటీ తీరానికి సమీపంలో సముద్ర గర్భంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అధికారులు గుర్తించారు. తక్కువ లోతులో భూకంపం సంభవించడంతో దీని ప్రభావం ఉపరితలంపై చాలా బలంగా కనిపించింది. టైటుంగ్‌తో పాటు హువాలిన్, తైచుంగ్, రాజధాని తైపీ నగరాల్లో భూప్రకంపనలు స్పష్టంగా వినిపించాయి. తైపీ నగరంలోని ఆకాశహర్మ్యాలు దాదాపు 30 సెకన్ల పాటు ఊగడంతో కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు, నివాస సముదాయాల్లోని ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భారీ భూకంపం కారణంగా తైవాన్‌లోని హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌పై స్వల్ప ప్రభావం పడింది. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో రైళ్లను నిలిపివేసి, పట్టాలను, ఇతర మౌలిక సదుపాయాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. తీర ప్రాంతాల్లో సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ, రాబోయే 24 నుంచి 48 గంటల పాటు శక్తివంతమైన ఆఫ్టర్ షాక్స్ (తదుపరి ప్రకంపనలు) వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.








