- కృష్ణా జలాల విషయంలో
- కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు తీరని అన్యాయం చేశాయి
- కేంద్ర మంత్రి బండి సంజయ్
- జాతీయ అబద్దాల పోటీలు నిర్వహిస్తే రెండు బహుమతులు ఆ రెండు పార్టీలకే అని ఎద్దేవా
హైదరాబాద్, మహా : కృష్ణా జలాల వాటా వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలతో రాజకీయం చేస్తున్నాయని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. హైదరాబాద్‌లో “జాతీయ అబద్ధాల పోటీలు” నిర్వహిస్తే ఈ రెండు పార్టీలకే ప్రథమ స్థానాలు దక్కుతాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అసెంబ్లీని స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యంగా, 2014 రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ 89ని చేర్చి, పాత కేటాయింపులను మార్చకుండా అడ్డుపడి తెలంగాణకు తొలి అన్యాయం చేసింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమేనని బీజేపీ స్పష్టం చేసింది. నాటి తప్పిదం వల్లే కొత్త ట్రైబ్యునల్‌కు నీటి పునర్విభజన చేసే అవకాశం లేకుండా పోయిందని ఆరోపించింది. ఈ మేరకు బండి సంజయ్ లేఖ విడుదల చేశారు.
లేఖలోని అంశాలివే..
యూపీఏ చేసిన ఈ చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023 అక్టోబరు 6న కొత్త ట్రైబ్యునల్‌కు సంబంధించి ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’ ఇస్తూ గెజిట్ విడుదల చేసిందని గుర్తు చేసింది. దీనివల్ల కృష్ణా బేసిన్ జలాలను శాస్త్రీయంగా పునర్విభజన చేసే అవకాశం ఏర్పడిందని వివరించింది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు దక్కాల్సిన 555 టీఎంసీల వాటాకు బదులు, కేవలం 299 టీఎంసీలకే అంగీకరించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని మండిపడింది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టినప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం మౌనంగా ఉండి పరోక్షంగా ఏపీకి సహకరించిందని, దీనిపై తాము కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డు ఏపీకి ఐదుసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ అవగాహన లేకుండా కేంద్రంపై బురద జల్లుతున్నాయని బీజేపీ ధ్వజమెత్తింది. పోలవరం ద్వారా మళ్లించే 45 టీఎంసీల నీటిని పాలమూరు ప్రాజెక్టుకు వాడుకోవాలని కేంద్రం సూచించినా, సరైన సమగ్ర వివరాలు (డీపీఆర్) పంపడంలో రాష్ట్ర పాలకులు విఫలమయ్యారని పేర్కొంది. టెక్నికల్ వివరాల లేమి వల్లే డీపీఆర్ వెనక్కి వచ్చిందే తప్ప తిరస్కరించలేదని, సీడబ్ల్యూసీ కోరిన వివరాలు పంపిస్తే వెంటనే ఆమోదం లభిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ తప్పిదాలను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అసెంబ్లీలో దూషణలు మానుకుని తెలంగాణ హక్కుల కోసం కేంద్రంతో కలిసి పని చేయాలని బండి సంజయ్ హితవు పలికారు.








