- పేరు మారాలన్న సరదా ఉంటే
- రేవంత్ ఖాన్ గా మార్చుకో
- సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి కౌంటర్ అటాక్
న్యూఢిల్లీ, మహా : సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు జవాబిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని, ఆయన పేరు కిషన్ రెడ్డి కూడా కాదని.. కేసీఆర్‌ను జైల్లో వేసేవరకు కల్వకుంట్ల కిషన్ రావు గానే పిలుస్తానని సోమవారం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి మంగళవారం కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు, నా పేరు, ఇంటిపేరు మార్చి పిలుస్తున్నారు, హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే మాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు, అంత సరదాగా ఉంటే మీరు రేవంత్ ఖాన్‌గా పేరు మార్చుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడానికి మీరెవరని నిలదీశారు. మీరు ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు నిప్పులు పోస్తూనే ఉంటాం. నేను ఎవరికీ దత్తపుత్రుడిని కాదు. కేసీఆర్‌కు మీకు ఏదైనా ఉంటే.. మీరు మీరు తేల్చుకోండి. మీ విమర్శల మధ్యలోకి నన్ను లాగకండని కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మహదేవప్ప ఆత్మహత్యపై లోక్ సభలో ప్రస్తావన
అంతకుముందు నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎస్టీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడాన్ని కిషన్ రెడ్డి సభలో ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఇలాంటి దారుణం జరగడం ఘోరమన్నారు. ‘గెలవడం ఖాయం.. గెలిచిన తర్వాత కూడా నన్ను అధికార పార్టీ వేధిస్తుందని భార్యతో స్పష్టంగా చెప్పి.. ఎస్టీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఎంపీ తెలిపారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.







