Mahaa Daily Exclusive

  ఘనంగా పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్…

Share

 

హైదరాబాద్, మహా : మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటిఏ) వేదికగా 25వ బ్యాచ్ పోలీస్ జాగిలాలు మరియు వాటి హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం ఘనంగా జరిగింది. ఎనిమిది నెలల పాటు సాగిన కఠినమైన, శాస్త్రీయ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 105 మంది హ్యాండ్లర్లు, 76 జాగిలాలు ఇప్పుడు విధుల్లో చేరడానికి సిద్ధమయ్యాయి. ఈ బృందంలో తెలంగాణకు చెందిన 42 జాగిలాలు, బీహార్ సీఐడీకి చెందిన 30, సీఐఎస్ఎఫ్ కు చెందిన 4 జాగిలాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఈ జాగిలాలు కేవలం జంతువులు మాత్రమే కావని, నేర పరిశోధనలో పోలీసులకు అత్యంత నమ్మకమైన మరియు క్రమశిక్షణ కలిగిన భాగస్వాములన్నారు. జాగిలాలకు, హ్యాండ్లర్లకుమధ్యలో ఉన్న అవగాహనను బట్టి శిక్షణ మెరుగ్గా ఉంటుందన్నారు. నేరస్థులను వేటాడటం, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను గుర్తించడం, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని, వీటి రాకతో పోలీసు శాఖ సామర్థ్యం మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణను సమర్థవంతంగా నిర్వహించిన ట్రైనింగ్ అకాడమీ అధికారులను సిబ్బందిని అడిషనల్ డీజీపీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఐఎస్ డబ్ల్యూ, ఓఎస్‌డీ వి.బి. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ, 2004లో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రం నేడు దేశస్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలతో పోలీస్ శిక్షణ సంస్థగా గుర్తింపు పొందిందని ప్రకటించారు. ఇప్పటివరకు ఈ అకాడమీ ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన 919 పోలీస్ జాగిలాలు, 1310 మంది హ్యాండ్లర్లకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా 67వ మరియు 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లలో తెలంగాణ పోలీస్ విభాగం వరుసగా ప్రథమ స్థానంలో నిలిచి బంగారు, వెండి పతకాలను కైవసం చేసుకోవడం ఇక్కడి శిక్షణ నాణ్యతకు నిదర్శనమని గుర్తుచేశారు. జాగిలాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 650 గజాల ‘కెనైన్ ఆల్ఫాక్షన్ పార్క్’, అత్యాధునిక వెటర్నరీ ఆస్పత్రి వంటి వసతులు వీటి ఆరోగ్యం మరియు పనితీరును మెరుగుపరుస్తాయని ఆయన వివరించారు.

శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. ఎక్స్‌ప్లోజివ్ విభాగంలో సీఐఎస్ఎఫ్ కు చెందిన వి. భాస్కర రావు (జాగిలం లియో), నార్కోటిక్ విభాగంలో బీహార్ సీఐడీకి చెందిన సుదర్శన్ కుమార్ (జాగిలం చార్లీ), ట్రాకర్ విభాగంలో రామగుండంకు చెందిన ఎం. శ్రీనాథ్ (జాగిలం రాకీ) ప్రథమ బహుమతులు సాధించారు. ఫిజికల్ పెర్ఫార్మెన్స్ టెస్టులో కరీంనగర్ కు చెందిన బి. నితిన్ మొదటి స్థానంలో నిలవగా, వివిధ బ్రీడ్‌ల అజిలిటీ విభాగంలో సింతు కుమార్, బి. కృష్ణ, విశాల్ కుపాలే, వి. కుమారస్వామి, బి. నరేష్ బాబు తమ జాగిలాలతో ప్రతిభ చాటారు. అలాగే కే. సంతోష్ రాకల, పి. గోపి, బాబితా కుమారి తదితరులు కన్సోలేషన్ బహుమతులు అందుకోగా, ఎం. సురేష్ రెడ్డి పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఇంటెలిజెన్స్ ఐజిపి కార్తికేయ, ఎస్పీలు అపూర్వరావు, కరుణాకర్, చక్రవర్తి అకాడమీ ట్రైనింగ్ కన్సల్టెంట్ మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest