- ఇరాన్తో దీర్ఘకాలిక యుద్ధం
- – అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం
- – ట్రంప్ సంచలన ప్రకటన
- మరిన్ని భీకర దాడులు చేస్తాం
- ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: ట్రంప్ హెచ్చరిక
- – ఇరాన్ పై దాడుల్లో 555మంది మృతి
- – ఇరాన్ లో 131 నగరాలపై దాడులు
మహా నెట్ వర్క్
మరిన్ని భీకర దాడులు చేస్తామని, ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, తమ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని తీవ్ర దాడులు ఉంటాయని తెలిపారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, వారు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యాన్ని అమెరికా కలిగి ఉందని, దానిని ఇప్పుడు ఉపయోగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సాఫీగా, తమకు ఎలాంటి ఇబ్బందిలేకుండా సాగుతోందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇరాన్ ప్రజలు నియంత పాలన నుంచి స్వేచ్ఛ పొందడానికి అమెరికా ఈ సైనిక చర్యకు ఉపక్రమించిందని అన్నారు. ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై అసలైన దాడిని ఇంకా ప్రారంభించలేదని, ఆ దేశం ఇలాగే వ్యవహరిస్తే దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో దీర్ఘకాల యుద్దానికి సిద్దంగా ఉన్నామని ట్రం్ తేల్చడం సంచలనంగా మారింది.
ఇరాన్లో 555 మంది మృతి
ఇరాన్‌పై అమెరికా– ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 555 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 131 నగరాలు దాడులకు గురయ్యాయని ఆ సంస్థ తెలిపింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. సంయుక్తంగా అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌లో కీలక సైనిక, వ్యూహాత్మక లక్ష్యాలపై కచ్చితమైన వైమానిక దాడులు జరుపుతున్నాయని సమాచారం. మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకారంగా క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో కువైట్‌లోని అమెరికా రాయబారి కార్యాలయ సముదాయంపై కూడా క్షిపణి దాడి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
విస్తరిస్తున్న యుద్దం
యుద్ధం ఇరాన్‌కే పరిమితం కాకుండా ప్రాంతీయంగా విస్తరిస్తోంది. దక్షిణ లెబనాన్లో కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అక్కడ కనీసం 31 మంది మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా రాకెట్లు, డ్రోన్లతో ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఇంకా ఎన్నో రోజులపాటు యుద్ధం కొనసాగొచ్చని హెచ్చరించింది. అమెరికా బలగాలు కూడా ఈ యుద్ధంలో నేరుగా పాల్గొంటున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, తాజా ఘర్షణల్లో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్‌ను ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన సైనిక చర్యల్లో ఒకటిగా అభివర్ణించారు. లక్ష్యాలు నెరవేరే వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ మాత్రం చర్చలకు తావులేదని ప్రకటించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రకటనలతో దౌత్యపరమైన పరిష్కారం దూరమవుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపుతోంది. సూయిజ్ కెనాల్ మార్గంలో నౌకాయానాన్ని కొన్ని సంస్థలు నిలిపివేశాయి. పలు పశ్చిమాసియా దేశాల్లో గగనతలాన్ని మూసివేయడంతో వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన స్ట్రయిట్ ఆఫ్ హార్మూజ్ వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో ఆయిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. మొత్తంగా చూస్తే, అమెరికా– ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలు, ప్రాంతీయ మిలీషియా దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. ప్రాణనష్టం పెరుగుతుండగా, అణు కేంద్రాల భద్రతపై ప్రపంచం ఆందోళన చెందుతోంది.







