- ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వని
- ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
- ఒకే వాయిదాలో ఫీజు చెల్లించే విధానం తొలగించాలి
- హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసిన జై స్వరాజ్ పార్టీ
హైదరాబాద్, మహా: తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తమకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆ కళాశాలలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు. ఆయా కళాశాలలపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ వి. బాలకృష్ణ రెడ్డికి కేఎస్ఆర్ గౌడ బుధవారం ఫిర్యాదు చేశారు. విదేశాల్లో చదువులకు వెళ్లిన విద్యార్థులు లేదా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇంజనీరింగ్ కళాశాలల దుర్మార్గం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, పలువురు తల్లిదండ్రులు ఈ అంశంపై తమ పార్టీకి తెలిపిన విషయాన్ని ఛైర్మన్ దృష్టికి తీసుకు వచ్చామని తెలిపారు. విద్యార్థులను వేధిస్తున్న కళాశాలల్లో విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాల ఒకటని, ఆధారాలతో ఛైర్మన్ కేఎస్ఆర్ గౌడ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధానం ప్రకారం విద్యార్థుల చదువులు ముగిసిన వెంటనే వారి ఉత్తీర్ణత ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వాలని, కళాశాలలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ తల్లిదండ్రులు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని, పేదలైన తల్లిదండ్రులు ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేక అటు ప్రభుత్వం చెల్లించక విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని కేఎస్ఆర్ గౌడ బాలకృష్ణ రెడ్డికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్న నాటి నుండి ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా కళాశాలలకు ఇవ్వలేదని, ఇది ఆయా వర్గాల విద్యార్థులకు చాలా ఇబ్బందిగా మారిందని ఆయన అన్నారు.
అదే విధంగా చాలా ఇంజనీరింగ్ కళాశాలలు నిర్దేశించిన ఫీజును ఒకే వాయిదాలో చెల్లించాలని, ఆన్లైన్ విధానం రూపొందించిన కారణంగా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, తల్లిదండ్రుల వెసులుబాటును బట్టి వివిధ వాయిదాల్లో విద్యా సంవత్సరం పూర్తి అయ్యే లోగా చెల్లించే అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు ఇంజనీరింగ్ కళాశాలలకు ఆదేశాలు జారీ చేయాలని కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. తమ శక్తి మేరకు ఇంజనీరింగ్ కళాశాలలను కట్టడి చేస్తున్నామని, చాలా కళాశాలలు ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదని తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారని కేఎస్ఆర్ గౌడ అన్నారు.








