Mahaa Daily Exclusive

  దేశంలో తొలి పాసివ్ కారుణ్య మరణం….

Share

  • దేశంలో తొలి పాసివ్ కారుణ్య మరణం
  • హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి
  • తీర్పు వెల్లడిస్తూ కన్నీళ్లు పెట్టిన న్యాయమూర్తి

న్యూఢిల్లీ, మహా : యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా (32) కేసులో కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కారుణ్య మరణం తప్ప మరో దారి లేని ఈ కేసులో తీర్పు వెల్లడిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా తీవ్ర భావోద్వేగానికి లోనై, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. బుధవారం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం హరీష్ రాణా కుటుంబం దాఖలు చేసిన కారుణ్య మరణం అప్లికేషన్‌కు ఆమోదం తెలిపింది. అయితే దేశంలో తొలి పాసివ్ కారుణ్య మరణం ఇదే. ట్రీట్ మెంట్ నిలిపివేస్తూ పేషెంట్ చనిపోవడానికి అవకాశం కల్పించడమే పాసివ్ కారుణ్య మరణం. ఇంజెక్షన్ ద్వారా, లేదా ఇతర చికిత్సా విధానాల ద్వారా పేషెంట్‌కు యాక్టివ్ కారుణ్య మరణం సంభవించేలా చేసిన కేసులు ఉన్నాయి.

హాస్టల్ బిల్డింగ్ పైనుంచి పడిపోయిన కాలేజీ టాపర్

2013లో పంజాబ్ యూనివర్శిటీలో చదువుతున్న సమయంలో హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి హరీష్ రాణా పడిపోయాడు. ఈ ప్రమాదంలో విద్యార్థి హరీష్ రాణా తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెదడుపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి నుంచి హరీష్ రాణా గత 13 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ఈ కాలంలో అతడి పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. దాదాపు దశాబ్దకాలం తరువాత అతడి అవస్థ చూడలేక హరీష్ రాణా కుటుంబం అతడికి కారుణ్య మరణం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అత్యంత విషాకరం ఘటన.. జడ్జి కన్నీళ్లు..

జస్టిస్ పార్దీవాలా ఈ కేసు తీర్పు వెల్లడిస్తూ ‘ఇది అత్యంత విషాదకరం. ఇది మాకు చాలా కష్టమైన నిర్ణయం. కానీ ఈ అబ్బాయిని (హరీష్ రాణా) ఇంకా కష్టపెట్టలేం. అతడి బాధ చూడలేకపోతున్నాం. కుటుంబం ఎప్పుడూ ఆయనను వదిలి పెట్టలేదు. ఎవరినైనా ప్రేమించడం అంటే అత్యంత దారుణమైన సమయంలో కూడా వారిని సంరక్షించడమే. ప్రస్తుతం మేం చివరి నిర్ణయం తీసుకోవాల్సిన దశలో ఉన్నామని’ పేర్కొన్నారు. హరీష్ కుటుంబం పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు ఆమోదించింది. గత 13 ఏళ్లుగా హరీష్ రాణాకు అందిస్తున్న మెడికల్ సపోర్ట్ సిస్టమ్‌ను తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పునిస్తూ కోర్టు ఇలా వ్యాఖ్యానించింది.. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఇలాంటి కేసుల్లో మరణం అనేది పేషెంట్‌కు సరైనదా కాదా అనేది కాదు. లైఫ్ సస్టైనింగ్ ట్రీట్‌మెంట్ (వెంటిలేటర్) ద్వారా అతడ్ని బతికించడం బాధితుడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉందా లేదా అనేదే అసలైన ప్రశ్న. మెడికల్ ట్రీట్‌మెంట్‌ను ఉపసంహరించుకోవడానికి హరీష్‌ను ఎయిమ్స్ పాలియేటివ్ కేర్‌లో చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి గౌరవప్రదంగా జరిగేలా చూడాలని తమ తీర్పులో సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

నిరంతరం మంచంపైనే ఉండటం వల్ల హరీష్ రాణా శరీరంలో గాయాలయ్యాయి. పక్షవాతానికి గురైన హరీష్‌కు శ్వాస తీసుకోవడానికి, ఆహారం తినడానికి ఇబ్బంది అవుతోంది. రోజువారీ సంరక్షణ కోసం మెడికల్ ట్రీట్ మెంట్ అవసరం. ఎయిమ్స్ డాక్టర్స్ టీమ్ హరీష్ రాణా ఇంటికి వెళ్లి పరీక్షించి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. హరీష్ ట్రాకియోస్టోమీ ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటున్నాడని, గ్యాస్ట్రోస్టోమీ ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నారని నివేదికలో తెలిపారు.

గతంలో ఢిల్లీ హైకోర్టు హరీష్ రాణా కుటుంబం దాఖలు చేసుకున్న పాసివ్ కారుణ్య మరణం పిటిషన్‌ను కొట్టివేసింది. భారత చట్టం ప్రకారం యాక్టివ్ కారుణ్య మరణంకి అనుమతి లేదని అప్పట్లో పేర్కొంది. ఆ తర్వాత ఆగస్టు 2024లో ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ మానవీయ కోణంలో పరిష్కారాన్ని అన్వేషించాలని కోర్టు కోరింది.