- స్పీకర్ తీర్పుపై మండిపడ్డ కేటీఆర్
- ఇది ప్రజా తీర్పును అవమానించడమేనని వ్యాఖ్య
- కాంగ్రెస్ పోటీ చేసినా క్లీన్ ఇవ్వడం ఏంటని ప్రశ్న
హైదరాబాద్, మహా : ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి (దానం నాగేందర్) కి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును నిస్సిగ్గుగా అవమానించడమేనని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజు అని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా వాడుకోవడానికి ఇది ఒక నిదర్శనమని ఆయన ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటుంటే, దానికి స్పీకర్ తన ముద్ర వేయడం వల్ల ప్రజాస్వామ్య విలువలకే ముప్పు వాటిల్లుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి నిర్ణయాలు వ్యవస్థలపై ప్రజలకున్న విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న వారికి సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తన నిరసనను వ్యక్తం చేశారు.
స్పీకర్ తీర్పును స్వాగతించిన కడియం
తెలంగాణ స్పీకర్ తీర్పును ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. తమపై వేసిన పిటిషన్లు చట్టబద్దం కావని, పార్టీ ఫిరాయిస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి.. కానీ నాకు బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. పార్టీ పరంగా బీఆర్ఎస్ ఎందుకు పిటిషన్ వేయలేదని కేసీఆర్ ని ప్రశ్నించారు. మేం 38 మంది సభ్యులం, దాని ప్రకారం సమయం కావాలని అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు అడిగిన విషయాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ఎల్పీకి ప్రతినెల మా జీతం నుంచి రూ. 5 వేలు జమ అవుతుండటం నిజం అయినప్పుడు… మేం బీఆర్ఎస్లోనే ఉన్నాం అనేది వాస్తవం అన్నారు. పార్టీ అధినాయకత్వానికి దూరంగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజల కోసం మేం పని చేస్తున్నామన్నారు. గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు.. ? పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి మరీ ఆ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా చేశారని కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నా నుంచి వివరణ కోరలేదు : దానం
పార్టీ మారారని తనపై ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నుంచి తనను ఇప్పటివరకూ ఎవరూ వివరణ కోరలేదని దానం నాగేందర్ అన్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం తనను ఆహ్వానించకపోవడాన్ని తప్పుపట్టారు. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేదన్నారు. వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని, వాటికి అనుగుణంగా నడుచుకున్నట్లు పేర్కొన్నారు.
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ ల పిటిషన్లు విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దశలవారీగా వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా బుధవారం (మార్చి 11న) కడియం శ్రీహరి, దానం నాగేందర్ ల అనర్హత పిటిషన్లు కొట్టివేయడంతో అందరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు అయింది.








