- రాష్ట్రానికి వర్ష సూచన
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- 15 వ తేదీ నుంచి వర్షాలు
- మూడు రోజులు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
హైదరాబాద్, మహా : మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం పది గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. వేసవి తాపం ఇప్పటికే పెరగడంతో ముందున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎండల తీవ్రత తగ్గి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
మార్చి 14 వరకు ఎండలు ఇదే విధంగా కొనసాగనున్నప్పటికీ, మార్చి 15 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడవచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. మార్చి 16, 17 తేదీల్లో కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.








