Mahaa Daily Exclusive

  శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు…..

Share

* శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు.
* సాంకేతిక చిక్కులకు స్వస్తి.. ఇకపై ఒకే లావాదేవీలో విరాళం, దర్శన రుసుము చెల్లింపు.
తిరుమల,మహా.
తిరుమల శ్రీవారి భక్తులకు దర్శన భాగ్యాన్ని మరింత సులభతరం చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు టికెట్ల జారీ విధానంలో నవ్యరీతిని ప్రవేశపెట్టింది. భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. గతంలో ఉన్న రెండు విభిన్న లావాదేవీల ప్రక్రియను రద్దు చేస్తూ, విరాళం మరియు దర్శన రుసుమును కలిపి ఒకేసారి చెల్లించే వెసులుబాటును కల్పించింది.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం భక్తులు మొదట రూ.10,000 విరాళంగా చెల్లించిన తర్వాతే, ప్రత్యేకంగా రూ.500 దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఈ క్రమంలో విరాళం చెల్లింపు విజయవంతమైనప్పటికీ, దర్శన టికెట్ ఖరారయ్యే లోపు కోటా పూర్తవడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యేవారు. డబ్బు కట్ అయినా టికెట్ రాకపోవడంతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తేవి. ఈ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు టీటీడీ అధికారులు కసరత్తు చేసి, విరాళం రూ.10,000 మరియు దర్శన రుసుము రూ.500 కలిపి మొత్తం రూ.10,500లను ఒకే లావాదేవీలో చెల్లించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.
ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ కోటా కింద టీటీడీ 800 శ్రీవాణి టికెట్లను విడుదల చేస్తోంది. ఒకే ఐడీపై భక్తులు గరిష్టంగా నాలుగు టికెట్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. భక్తుల చెల్లింపులు సాఫీగా సాగేందుకు యూనియన్ బ్యాంక్‌తో టీటీడీ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభంగా లావాదేవీలు నిర్వహించవచ్చు. అయితే, మూడు నెలల ముందుగా చేసుకునే అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని, కేవలం ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లో మాత్రమే ఈ మార్పులు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది.

Latest