- ఆపరేషన్ కగార్’ క్లైమాక్స్.
- అస్తమిస్తున్న ఎర్ర సూర్యుడు.
- మార్చి 31 డెడ్‌లైన్‌తో దండకారణ్యంలో ప్రకంపనలు!
- జనజీవన స్రవంతిలోకి అజ్ఞాత నేతలు!
- దశాబ్దాల నెత్తుటి నేలపై శాంతి కపోతాలు.
(గడల నరసింహారావు సీనియర్ జర్నలిస్ట్ ఖమ్మం.)
దశాబ్దాల తరబడి దండకారణ్యం నెత్తుటితో తడిచింది. పేదల రాజ్య స్థాపన, వర్గ రహిత సమాజం, కార్మిక కర్షక విప్లవం పేరుతో సాగిన సాయుధ గెరిల్లా పోరాటం ఇప్పుడు అత్యంత క్లిష్టమైన చారిత్రక కూడలిలో నిలబడింది. 2026, మార్చి 31.. ఇప్పుడు భారత అంతర్గత భద్రతా చరిత్రలో, ప్రత్యేకించి కమ్యూనిస్టు సాయుధ పోరాట చరిత్రలో ఒక నిర్ణయాత్మకమైన మలుపుగా మారబోతున్న తేదీ. కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి హోంమంత్రి అమిత్ షా విధించిన ఈ డెడ్‌లైన్, దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ పునాదులను తీవ్రంగా కదిలిస్తోంది. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో రాజ్యం నిర్దాక్షిణ్యంగా మోపుతున్న ఉక్కుపాదం, మరోవైపు కేంద్ర కమిటీ సభ్యుల నుంచి ఏరియా కమాండర్ల వరకు కొనసాగుతున్న వరుస లొంగుబాట్లు ఎర్ర జెండా ఉనికినే తీవ్రంగా ప్రశ్నార్థకం చేస్తున్నాయి**
**విప్లవ శిబిరంలో మృత్యు భయం…మార్చి 31 అల్టిమేటం పరమార్థం**
సాయుధ రైతాంగ విప్లవం ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలనే మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు సిద్ధాంతాలకు ఇప్పుడు ఊహించని అతిపెద్ద పరీక్ష ఎదురైంది. భారత ప్రభుత్వం మావోయిజాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి దృఢ నిశ్చయంతో ఆపరేషన్ కగార్ కు శ్రీకారం చుట్టింది. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని సంపూర్ణ నక్సల్స్ రహితంగా (Maoist-free India) మారుస్తామని అమిత్ షా చేసిన ప్రకటన కేవలం ఒక రాజకీయ నినాదం కాదు, అదొక అత్యంత వ్యూహాత్మక సైనిక, మరియు మానసిక దాడి. ఈ గడువు సమీపిస్తున్న కొద్దీ అజ్ఞాతంలో ఉన్న దళ నాయకుల్లో, కేంద్ర కమిటీ సభ్యుల్లో తీవ్రమైన అంతర్మథనం, ఆందోళన మొదలయ్యాయి. ఒకవైపు ఆధునిక ఆయుధాలతో కూడిన కోబ్రా కమాండోలు, డ్రోన్ టెక్నాలజీతో భద్రతా దళాల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు బస్తర్, కుర్రెగుట్ట లాంటి దట్టమైన అటవీ ప్రాంతాలను అనుక్షణం జల్లెడ పడుతున్నాయి. మరోవైపు మృత్యువు లేదా లొంగుబాటు అనే రెండే కఠిన ప్రత్యామ్నాయాలను బూర్జువా రాజ్యం వారి ముందుంచింది. వర్గ పోరాటంలో అసువులు బాసిన అమరుల ఆశయాలకంటే, అనుక్షణం ప్రాణాపాయం అంచున నిలబడిన వాస్తవిక భయానక పరిస్థితి వారిని లొంగుబాటు దిశగా నడిపిస్తోంది. ప్రభుత్వమిచ్చిన గడువు ముగిస్తే దళాల మనుగడ అసాధ్యమన్న సంకేతాలు విప్లవ శ్రేణుల్లో మున్నెన్నడూ లేని గందరగోళాన్ని సృష్టించాయి.
**కుప్పకూలుతున్న నాయకత్వం…సైద్ధాంతిక పునాదులపై బూర్జువా దాడి**
కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో దమనకాండలను, నిర్బంధాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి అత్యంత భిన్నంగా, ప్రమాదకరంగా ఉంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 180కి పైగా జిల్లాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టులు, నేడు కేవలం మూడు నాలుగు జిల్లాలకే, అదీ పరిమిత భౌగోళిక ప్రాంతానికే కుదించుకుపోవడం వారి వ్యూహాత్మక వైఫల్యానికి, రాజ్య అణచివేత పైచేయికి అద్దం పడుతోంది. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఎర్ర కారిడార్‌గా పిలుచుకునే ఆంధ్రాలోని తిరుపతి నుంచి నేపాల్‌లోని పశుపతి వరకు ఉన్న విస్తృత ప్రాంతంలో ఇప్పుడు భద్రతా దళాల బూట్ల చప్పుడు, హెలికాప్టర్ల గర్జనలు మాత్రమే వినిపిస్తున్నాయి. అగ్రశ్రేణి నాయకులు, సైద్ధాంతిక దిక్సూచులుగా భావించే కేంద్ర కమిటీ సభ్యులు సైతం పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం క్షేత్రస్థాయి క్యాడర్ లో నైతిక స్థైర్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. శ్రామికవర్గ అగ్రగామి పార్టీగా ఎంతో గర్వంగా చెప్పుకునే మావోయిస్టు పార్టీ, దళాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం, ఆయుధాలు-ఆహార సరఫరా చైన్ పూర్తిగా తెగిపోవడంతో అస్తిత్వ పోరాటం చేస్తోంది. ఇది కేవలం భౌతికమైన దాడి మాత్రమే కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థ మావోయిస్టుల సైద్ధాంతిక స్థైర్యంపై చేస్తున్న అత్యంత పదునైన మానసిక యుద్ధం.
**మారుతున్న సామాజిక ముఖచిత్రం…బ్యాలెట్ వైపు ఆదివాసీల అడుగులు**
సాయుధ పోరాటానికి దశాబ్దాలుగా ఊపిరి పోసిన అడవి బిడ్డలు, పీడిత వర్గాలు, ఆదివాసీలు ఇప్పుడు కనీస మౌలిక సదుపాయాలను, అభివృద్ధి ఫలాలను తీవ్రంగా కోరుకుంటున్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చిన ఎర్ర జెండా అగ్ర నాయకత్వానికి, క్షేత్రస్థాయిలో వేగంగా మారుతున్న సామాజిక, ఆర్థిక వాస్తవాలకు మధ్య పూడ్చలేనంత అంతరం పెరిగిపోయింది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా అటవీ ప్రాంతాల్లోకి రోడ్లు వేయడం, మొబైల్ టవర్లు నిర్మించడం, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం స్థానిక గిరిజనులను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే చైనా విప్లవ పంథా సిద్ధాంతం కంటే, ప్రజాస్వామ్య బ్యాలెట్ బాక్స్, తమ పిల్లల భవిష్యత్తు, శాంతియుత జీవనం వైపు యువత ఆకర్షితులవుతున్నారు. స్థానికుల నుంచి ఇన్ఫార్మర్ వ్యవస్థ బలపడటం మావోయిస్టులకు ఊపిరాడకుండా చేస్తోంది. ఇదే సమయంలో మార్చి 31 గడువును ప్రభుత్వం ఒక బ్రహ్మాస్త్రంగా ప్రయోగించింది. ఈ గడువులోగా లొంగిపోతే ఆకర్షణీయమైన పునరావాస ప్యాకేజీలు, క్షమాభిక్ష ఉంటాయని, లేనిపక్షంలో వినాశనం తప్పదని పంపిన స్పష్టమైన సందేశం విప్లవోద్యమ మూలాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఆకర్షణ, మరియు భయం రెండూ కలగలిసి దళాల్లో సామూహిక లొంగుబాట్లకు దారితీస్తున్నాయి.
**చారిత్రక సంధి దశ…సాయుధ విప్లవ అధ్యాయానికి ముగింపేనా?**
కార్మిక కర్షక రాజ్యం కోసం దశాబ్దాలుగా ప్రాణాలను పణంగా పెట్టి సాగిన సాయుధ గెరిల్లా పోరాటం ఇప్పుడు తన చారిత్రక ప్రస్థానంలో ఒక నిర్ణయాత్మక సంధి దశకు చేరుకుంది. మార్చి 31 తర్వాత దండకారణ్యం ఎవరి వశం అవుతుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఉత్కంఠ. వందలాది మంది దళ సభ్యులు లొంగిపోవడం కేవలం ప్రాణభయంతో తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, మారిన పరిస్థితుల్లో సాయుధ పోరాట పంథా ఆచరణాత్మకతపై వారిలోనే తలెత్తిన తీవ్రమైన సైద్ధాంతిక గందరగోళానికి కూడా ఇది సజీవ నిదర్శనం. భద్రతా బలగాల పటిష్టమైన వలయంలో ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరుకున్న ఈ తరుణంలో, మావోయిస్టులు తమ సైద్ధాంతిక, వ్యూహాత్మక పంథాలను మార్చుకుని కొత్త రూపంలో పోరాటాన్ని నిర్మిస్తారా? లేక ప్రభుత్వ ఉక్కుపాదానికి బలవుతూ, తమ ఉనికిని కోల్పోయి చరిత్ర పుటల్లో ఒక నెత్తుటి అధ్యాయంగా మాత్రమే మిగిలిపోతారా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, ఏప్రిల్ 1వ తేదీన ఉదయించే సూర్యుడు దండకారణ్యంలో దశాబ్దాల చీకట్లను పారద్రోలి, తుపాకుల మోతలకు బదులుగా శాంతి, అభివృద్ధి జీవనదులను పారిస్తాడని యావత్ దేశం ఉత్కంఠగా ఆశిస్తోంది. మార్చి 31.. ఒక విప్లవానికి ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త శాంతియుత శకానికి నాంది కూడా కావొచ్చు!







