- సోషల్ మీడియాలో రెచ్చగొడితే పదేళ్ల వరకు జైలు శిక్ష
- శాసనసభలో కొత్త బిల్లు.. తదుపరి పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు.
హైదరాబాద్, మహా.
సామాజిక మాధ్యమాలు, డిజిటల్ వేదికల ద్వారా విద్వేషాలను చిమ్ముతూ, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం – 2026’ బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విటర్), వాట్సాప్ వంటి వేదికల్లో మతం, కులం, భాషా పరమైన విద్వేష వ్యాఖ్యలు పెరిగిపోవడం, తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఈ కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే సభలో సభ్యులు వ్యక్తం చేసిన కొన్ని అభ్యంతరాల దృష్ట్యా, ఈ బిల్లును లోతుగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఈ కొత్త చట్టం ప్రకారం నేరాల తీవ్రతను బట్టి కఠినమైన శిక్షలు ఖరారు చేశారు. ఏదైనా వర్గం లేదా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విద్వేష పూరిత ప్రసంగాలు చేసినా, పోస్టులు పెట్టినా తొలిసారి నేరం చేసిన వారికి ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 50 వేల జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించారు. ఒకసారి శిక్ష అనుభవించిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా పదే పదే ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని ‘పునరావృత నేరస్థులు’గా పరిగణిస్తారు. ఇటువంటి వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు. మతం, కులం, లింగం, జన్మస్థలం, నివాసం, వైకల్యం, తెగ లేదా లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల మధ్య విరోధాన్ని పెంచేలా చేసే రాతలు, సంకేతాలు, దృశ్యరూపకాలను ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ప్రసారం చేయడం ఈ చట్టం కింద నేరంగా పరిగణించబడుతుంది. మరణించిన వ్యక్తులపై విద్వేష వ్యాఖ్యలు చేసినా ఈ చట్టం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే స్వేచ్ఛా వాణికి ఆటంకం కలగకుండా కొన్ని మినహాయింపులను కూడా బిల్లులో పొందుపరిచారు. విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, కళ, విద్యా సంబంధిత అధ్యయనాలు లేదా వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా వెలువడే పుస్తకాలు, కరపత్రాలు, చిత్రకళలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. కేవలం విద్వేషాన్ని ప్రేరేపించే ఉద్దేశంతో చేసే ప్రచారాలకే ఈ శిక్షలు వర్తిస్తాయని బిల్లు పేర్కొంది. నేరాలకు పాల్పడే వ్యక్తులే కాకుండా, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసే సంస్థలు, గ్రూపుల బాధ్యులపై కూడా చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తుంది.
ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారికి ఈ చట్టం కింద విస్తృత అధికారాలు ఇవ్వనున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సర్వీస్ ప్రొవైడర్లు లేదా సామాజిక మాధ్యమాల్లో ఉన్న నేరపూరిత సమాచారాన్ని లేదా విద్వేషపూరిత కంటెంట్‌ను తక్షణమే తొలగించేలా ఆదేశాలు జారీ చేసే అధికారం సదరు అధికారికి ఉంటుంది. ఏదైనా ప్రాంతంలో పాత నేరస్థులు మళ్లీ విద్వేషాలు రగిలించే అవకాశం ఉందని ముందస్తు సమాచారం ఉంటే, శాంతిభద్రతల పరిరక్షణ కోసం స్థానిక మేజిస్ట్రేట్లు తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ నేరాల వల్ల బాధితులైన వారికి రక్షణ కల్పించడంతో పాటు, నేర తీవ్రతను బట్టి వారికి పరిహారం అందించేలా కూడా నిబంధనలను రూపొందించారు. విద్వేష ప్రసంగాల నిర్మూలన ద్వారా రాజ్యాంగ విలువలను కాపాడటమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.








