- వారం తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్.
- జ్వరంతో సర్ గంగారామ్లో చేరిన కాంగ్రెస్ అగ్రనేత్రి.. * వాతావరణ మార్పులే కారణమన్న వైద్యులు.
ఢిల్లీ , మహా.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. గత వారం రోజులుగా జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి చేరుకున్నారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. గత మార్చి 24వ తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో తీవ్రమైన జ్వరంతో సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరారు. అప్పట్లో ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ‘సిస్టమిక్ ఇన్ఫెక్షన్’ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు యాంటీబయాటిక్స్తో చికిత్స ప్రారంభించింది.
సోనియాగాంధీ అనారోగ్యానికి దిల్లీలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం, అకస్మాత్తుగా మారిన వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆమె ఛాతీలో బిగుతుగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులు ఎదుర్కోవడంతో వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించారు. వారం రోజుల పాటు సాగిన చికిత్సకు ఆమె శరీరం సానుకూలంగా స్పందించడంతో ఇన్ఫెక్షన్ తగ్గిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయినప్పటికీ, మరికొద్ది రోజుల పాటు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. సోనియాగాంధీ ఆరోగ్యంగా తిరిగి రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.








