- సూరత్ అగ్నిప్రమాదంలో ఐదుగురి దుర్మరణం
- మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి.. పూట ఒకే కుటుంబంలో విషాదం.
- షార్ట్ సర్క్యూటే కారణమన్న ప్రాథమిక అంచనా.
- చీరల ప్యాకింగ్ యూనిట్‌లో మంటల విలయం.
సూరత్, మహా.
గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. లింబాయత్ ప్రాంతంలోని ఓ నివాస భవనంలో చెలరేగిన మంటలు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని బలితీసుకున్నాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక నాలుగేళ్ల బాలుడు ఉండటం అందరినీ కలిచివేసింది. పండుగ పూట జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.
స్థానిక పోలీసులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మీఠీ ఖాడీ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భవనంలో నివాసంతో పాటు చీరల ప్యాకింగ్ యూనిట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో భవనంలోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా లోపలే ఉన్నారు. గదిలో భారీగా నిల్వ ఉంచిన ఫోమ్ షీట్లు, ప్లాస్టిక్ కవర్లు, చీరలకు మంటలు వేగంగా అంటుకోవడంతో క్షణాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫోమ్ షీట్లు దహనమవడంతో వెలువడిన విషపూరిత పొగ కారణంగా బాధితులకు ఊపిరి ఆడలేదని, దాంతో వారు స్పృహ కోల్పోయి మంటల్లో చిక్కుకుపోయారని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. కిటికీలు, తలుపులు తక్కువగా ఉన్న ఇరుకు గది కావడంతో బాధితులకు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, మృతుల్లో నలుగురు మహిళలు కాగా, ఒకరు నాలుగేళ్ల పసివాడని అదనపు పోలీసు కమిషనర్ బలరాం మీనా తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, భవనం లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సిబ్బంది కిటికీలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే బాధితులు విగతజీవులుగా పడి ఉండటంతో కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. నివాస గృహాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు డీసీపీ కానన్ దేశాయ్ వెల్లడించారు. పారిశ్రామిక నగరమైన సూరత్‌లో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






