Mahaa Daily Exclusive

  యుద్ధ రంగానికి ‘అప్పు’ల ఎర…

Share

యుద్ధ రంగానికి ‘అప్పు’ల ఎర.
* పుతిన్ సంచలన నిర్ణయం.
* మిలిటరీలో చేరితే లక్షల కొద్దీ బకాయిలు మాఫీ.
*ఆర్థిక కష్టాల్లో ఉన్న యువతే టార్గెట్‌గా మాస్టర్ ప్లాన్.
* ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్ ఫైటర్ల కోసం రష్యా కొత్త చట్టం.
ఢిల్లీ, మహా.
ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా సాగుతున్న భీకర యుద్ధం ఎప్పటికీ కొలిక్కి రాకపోవడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సరికొత్త వ్యూహానికి పదునుపెట్టారు. సైన్యంలో చేరేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపకపోవడం, ఫ్రంట్‌లైన్‌లో సైనికుల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో క్రెమ్లిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం కోసం తుపాకీ పట్టి యుద్ధభూమిలోకి అడుగుపెట్టే కొత్త రిక్రూట్లను ఆకర్షించేందుకు ఏకంగా ఒక వినూత్న ఆర్థిక ప్యాకేజీని అస్త్రంగా ప్రయోగించింది. సైన్యంలో చేరితే వారికున్న పాత అప్పులన్నీ పూర్తిగా రద్దు చేస్తూ రష్యా ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
**పది మిలియన్ రూబుల్స్.. భారీ రుణ విముక్తి**
యుద్ధ రంగానికి వెళ్లే సైనికులకు రష్యా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్‌లో పోరాడేందుకు సైన్యంలో చేరే కొత్త రిక్రూట్లకు, ప్రైవేట్ కాంట్రాక్ట్ సైనికులకు సంబంధించిన పాత బ్యాంక్ లోన్లు, వినియోగదారుల రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేస్తూ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం సుమారు 10 మిలియన్ రూబుల్స్ (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1.33 లక్షలు) వరకు ఉన్న అప్పులన్నీ పూర్తిగా రద్దయిపోతాయి. ప్రభుత్వ డీల్‌కు ఒప్పుకుంటే చాలు, బ్యాంకుల నుంచి ఎలాంటి ఒత్తిడీ లేకుండా ప్రభుత్వం ఆ అప్పుల భారాన్ని తన భుజానికెత్తుకోనుంది.
**అప్పుల ఊబిలో ఉన్న యువతే టార్గెట్**
సరిహద్దుల్లో సైన్యం బలాన్ని అమాంతం పెంచేందుకు రష్యా ఈ మాస్టర్ ప్లాన్ రచించింది. ముఖ్యంగా దేశంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన, అప్పుల బాధలు తాళలేక సతమతమవుతున్న యువతను యుద్ధంలోకి దించడానికి ఈ ప్యాకేజీని ఎరగా వేసింది. రోజువారీ జీవితంలో అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్న యువకులు, ఈ భారీ రుణమాఫీ ఆఫర్‌ను చూసి పెద్ద ఎత్తున మిలిటరీలో చేరుతారని క్రెమ్లిన్ గట్టిగా విశ్వసిస్తోంది. ఆర్థిక కష్టాలను ఆసరాగా చేసుకుని సైనిక పాటవాన్ని పెంచుకునే ఈ ఎత్తుగడ రష్యా రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.
**కనీసం ఏడాది పాటు ప్రాణాలతో పోరాడాల్సిందే**
ఈ రుణమాఫీ ఆఫర్ పొందాలంటే రష్యా ప్రభుత్వం పెట్టిన ఒక కఠినమైన నిబంధనకు యువత అంగీకరించాల్సి ఉంటుంది. సైన్యంతో కనీసం ఒక సంవత్సరం పాటు పోరాడటానికి ఒప్పందం (కాంట్రాక్ట్) కుదుర్చుకునే ఏ రష్యన్ పౌరుడైనా ఈ అప్పుల విముక్తికి అర్హుడని ప్రభుత్వ ఉత్తర్వుల్లో అత్యంత స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఒకసారి అగ్రిమెంట్‌పై సంతకం చేస్తే చాలు, ఏడాది పాటు ఉక్రెయిన్ బార్డర్‌లో రక్తం చిందిస్తూ, ప్రాణాలను పణంగా పెట్టి శత్రువులతో పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
**భార్య అప్పులకు సైతం మాఫీ వర్తింపు**
కేవలం మిలిటరీలో చేరే సైనికుడి అప్పులే కాకుండా, అతని కుటుంబానికి కూడా భరోసా కల్పించేలా పుతిన్ సర్కారు ఈ చట్టంలో మరో కీలక సవరణ చేసింది. సదరు సైనికుడికే కాకుండా, అతని భార్య పేరిట ఉన్న రుణాలకు కూడా ఈ లోన్ వైవర్ వర్తిస్తుందని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. భార్యాభర్తల పేరిట ఉన్న అప్పులన్నీ ఒకే దెబ్బతో తీరిపోతాయన్న ఆశను కల్పించడం ద్వారా, కుటుంబ సభ్యులే తమ వారిని ఆనందంగా యుద్ధ రంగానికి పంపేలా ప్రోత్సహించే ఉద్దేశం ఈ నిర్ణయం వెనుక దాగి ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
**ప్రైవేట్ కాంట్రాక్ట్ సైనికులకు కూడా అవకాశం**
రష్యా రెగ్యులర్ ఆర్మీతో పాటు ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్లకు కూడా ఈ అప్పుల మాఫీ వరాన్ని పుతిన్ వర్తింపజేశారు. ఉక్రెయిన్ లాంటి సుదీర్ఘ యుద్ధంలో ప్రభుత్వ సైన్యంతో పాటు ప్రైవేట్ సైనికుల పాత్ర అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో, వారిని కూడా ఈ ఆఫర్ కిందికి తీసుకురావడం గమనార్హం. దీనివల్ల ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఫ్రంట్‌లైన్‌లోకి వెళ్లే ఫైటర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
**సైనిక కొరతను అధిగమించే క్రెమ్లిన్ ఎత్తుగడ**
గత మూడేళ్లుగా ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడుల్లో రష్యా సైతం భారీ ప్రాణనష్టాన్ని చవిచూసింది. వేలాది మంది సైనికులు మరణించడం, గాయపడటంతో రష్యన్ ఆర్మీలో కొత్త నెత్తురు ఎక్కించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నిర్బంధ సైనిక శిక్షణ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో, ఇలాంటి ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించడం ద్వారా ఎలాంటి వ్యతిరేకత లేకుండానే లక్షలాది మంది సైనికులను రిక్రూట్ చేసుకునేందుకు క్రెమ్లిన్ ఈ చట్టాన్ని ఒక బ్రహ్మాస్త్రంలా వాడుకుంటోంది.
**పుతిన్ ఆర్థిక అస్త్రం ఫలిస్తుందా?**
ఎవరెన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలబడినా వెనక్కి తగ్గేది లేదని పుతిన్ ఈ నిర్ణయంతో మరోసారి ప్రపంచానికి తేల్చి చెప్పారు. అయితే ప్రాణాల మీద ఆశ వదులుకుని కేవలం అప్పుల మాఫీ కోసం యువకులు ఏ మేరకు మిలిటరీ బూట్లు తొడుగుతారన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా దేశ ప్రజల ఆర్థిక కష్టాలను యుద్ధం కోసం వాడుకుంటూ పుతిన్ తీసుకువచ్చిన ఈ కొత్త చట్టం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక సరికొత్త అధ్యాయానికి, ఎన్నో సంచలనాలకు తెరతీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.