సరిహద్దుల్లో ‘డెమోగ్రఫీ’ డేంజర్.
* కేంద్రం సంచలన అడుగు.
* దేశ భద్రత, సార్వభౌమత్వాల రక్షణ కోసం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు.
* రిటైర్డ్ జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నౌలేకర్ నేతృత్వంలో రంగంలోకి నిపుణుల బృందం.
*అక్రమ చొరబాట్లు, జనాభా మార్పులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన.
* క్యాబినెట్ భేటీలో సరిహద్దుల ప్రక్షాళనకు చరిత్రాత్మక నిర్ణయాలు.
ఢిల్లీ, మహా.
దేశ రక్షణ, సార్వభౌమత్వాలకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న అసహజ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. అక్రమ చొరబాట్లు, ఇతర అసాధారణ కారణాల వల్ల సరిహద్దు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో అనూహ్యంగా, ప్రమాదకర స్థాయిలో మారుతున్న డెమోగ్రఫీ (జనాభా సమతుల్యత) వెనుక ఉన్న కుట్రలను ఛేదించేందుకు కేంద్రం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారుతున్న ఈ వ్యవహారంపై లోతైన అధ్యయనం చేసి, వాస్తవాలను వెలికితీసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రిమండలి ఒక అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది.
**ప్రధాని మోడీ ప్రకటనకు కార్యరూపం..**
గతేడాది (2025) ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన ఆధారంగానే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అధికారికంగా వెల్లడించారు. సరిహద్దుల్లో మారుతున్న జనాభా తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు రిటైర్డ్ జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నౌలేకర్ ఛైర్మన్‌గా ఈ పవర్ఫుల్ కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్దండులను సభ్యులుగా చేర్చింది. మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, నిఘా వ్యవస్థలపై పట్టున్న మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ శామికా రవిలతో పాటు భారత జనగణన కమిషనర్ (రిజిస్ట్రార్ జనరల్) ఇందులో కీలక సభ్యులుగా ఉండనున్నారు. కేంద్ర హోంశాఖలోని ఫారినర్స్-I విభాగ జాయింట్ సెక్రటరీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. దేశంలోని మత, సామాజిక వర్గాల వారీగా అసాధారణ జనాభా పెరుగుదల నమూనాలను సమగ్రంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి సమయపాలిత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కేంద్రానికి సిఫార్సులు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత.
**గిరిజన సమాజాల రక్షణకు పెను సవాలు: అమిత్ షా**
ఈ జనాభా మార్పుల వ్యవహారంపై హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. “జనాభా మార్పు అనేది కేవలం సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమే కాదు. ఇది జాతీయ భద్రత, శాంతిభద్రతలు, సామాజిక నిర్మాణం, గిరిజన సమాజాల పరిరక్షణకు కూడా నేరుగా సంబంధించిన విషయం” అని ఆయన కుండబద్దలు కొట్టారు. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని జరుగుతున్న అక్రమ చొరబాట్లు సామాజిక సమతుల్యతకు అతిపెద్ద సవాల్‌గా మారాయని స్పష్టం చేశారు. స్థానిక జనాభా స్వరూపం పూర్తిగా మారిపోవడం వల్ల దేశ అంతర్గత భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతోందని స్పష్టం చేశారు.
**చరిత్రాత్మక నిర్ణయాలు.. పొంచి ఉన్న రాజకీయ దుమారం**
ఇదే సమయంలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో సరిహద్దు భద్రతను అభేద్యంగా మార్చేందుకు పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ వంటి సరిహద్దు రాష్ట్రాలలో అక్రమ చొరబాట్లను సమూలంగా అరికట్టేందుకు సరిహద్దు భద్రతా దళాల నిఘాను అత్యాధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు. యాంటీ-ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్‌ను కట్టుదిట్టం చేయడంతో పాటు, సరిహద్దు జిల్లాల్లో నకిలీ పత్రాలతో ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు పొందిన అక్రమ చొరబాటుదారులను ఏరివేసేందుకు ఒక అతిపెద్ద ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా, ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ ద్వారా సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాలను భారీగా అభివృద్ధి చేసి, అక్కడి స్థానికులే దేశ రక్షణ కవచంగా మారేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
అయితే కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ వలసలు, జనాభా మార్పుల అంశం ఎప్పటికప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో, ఈ ఉన్నత స్థాయి కమిటీ విచారణ, తదుపరి చర్యలపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.







