Mahaa Daily Exclusive

  ఓటీటీలోకి ‘తాయి కిళవి’..

Share

  •  ఏప్రిల్‌ 10 నుంచి స్ట్రీమింగ్‌!
  •  బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన రాధిక చిత్రం.
  •  నిర్మాతగా శివ కార్తికేయన్‌.

చెన్నై, మహా.

వెండితెరపై తనదైన నటనతో దశాబ్దాలుగా అలరిస్తున్న సీనియర్ నటి రాధిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘తాయి కిళవి’ ఇప్పుడు డిజిటల్‌ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, త్వరలోనే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ఏకంగా రూ. 75 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో హాట్‌స్టార్’ ఈ చిత్ర డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి తమిళంతో పాటు తెలుగు సహా వివిధ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాధిక ‘పవనుత్తాయి’ అనే 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో ఒదిగిపోయారు. వడ్డీ వ్యాపారం చేస్తూ, ఆస్తిపాస్తులు వెనకేస్తూ తన ముగ్గురు కొడుకులు, కోడళ్లను తన గుప్పిట్లో ఉంచుకునే కఠినమైన ఇల్లాలుగా ఆమె నటన అద్భుతంగా సాగింది. అయితే, అనూహ్యంగా ఆమె పక్షవాతం బారిన పడి మాట పడిపోవడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.

ఆమె సంపాదించిన డబ్బంతా బంగారంగా మార్చి ఎక్కడో దాచిందని భావించిన కుటుంబ సభ్యులు, ఆ నిధి కోసం చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదురయ్యే నాటకీయ పరిణామాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మునీశ్ కాంత్, సింగం పులి, అరుళ్ దాస్, బాలశరవణన్ వంటి నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా రాధిక తన ఆహార్యం, హావభావాలతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని సినీ విశ్లేషకులు కొనియాడారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంటివద్దే ఈ విభిన్నమైన కథా చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం లభించింది.

Latest