Mahaa Daily Exclusive

  మెహదీపట్నంలో కల్తీ ఐస్ క్యాండీల గుట్టురట్టు..

Share

  • ఒకరి అరెస్టు, రూ. 5.44 లక్షల ఆస్తి స్వాధీనం.

మెహదీపట్నం, మహా.

ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్యాండీలు, లస్సీలను తయారు చేస్తున్న ఒక కేంద్రంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మెహదీపట్నం పరిధిలోని అహ్మద్ నగర్, ఫస్ట్ లాన్సర్ బడా బజార్‌లోని ‘ఆలియా ఐస్ క్రీమ్ పార్లర్’పై కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ జోన్) , మెహదీపట్నం పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యత లేని పదార్థాలతో తినుబండారాలను తయారు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ ముషారఫుద్దీన్ (24)గా పోలీసులు గుర్తించారు. తక్కువ పెట్టుబడితో అక్రమంగా భారీ లాభాలు గడించాలనే ఉద్దేశంతో నిందితుడు ప్రమాదకరమైన రసాయనాలు, అపాయకరమైన ఇతర పదార్థాలను ఉపయోగిస్తూ ఐస్ క్యాండీలు, లస్సీలను తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తయారీ కేంద్రంలో కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, సామాన్య ప్రజలు ఇష్టంగా తాగే లస్సీలను ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో తయారు చేయడం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సోదాల్లో భాగంగా తయారీ కేంద్రం నుంచి భారీ మొత్తంలో ఐస్ క్యాండీలు, లస్సీ ప్యాకెట్లు, నిల్వ ఉంచిన ముడి సరుకులు మరియు తయారీకి ఉపయోగించే యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టోరేజ్ యూనిట్లు, ప్యాకింగ్ మెషినరీతో సహా స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు రూ. 5.44 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయట లభించే శీతల పానీయాలు, ఐస్ క్రీముల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కేంద్రాల సమాచారాన్ని తక్షణమే పోలీసులకు తెలపాలని ఉన్నతాధికారులు సూచించారు.

Latest