Mahaa Daily Exclusive

  శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా ‘హైడ్రోపోనిక్‌ గంజాయి’ పట్టివేత..

Share

  •  విలువ రూ. 25 కోట్లు.
  •  బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల అరెస్టు.. లగేజీ బ్యాగుల్లో గుట్టురట్టు.

శంషాబాద్‌, మహా .

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్‌కు కస్టమ్స్ అధికారులు గట్టి దెబ్బ కొట్టారు. బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు 25.4 కిలోల అత్యంత ఖరీదైన ‘హైడ్రోపోనిక్ గంజాయి’ని కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 25 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నుంచి అందిన ముందస్తు సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు ఈ మెరుపు దాడులు నిర్వహించారు.

వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్ నుంచి ఎఫ్‌డీ-118 విమానంలో వచ్చిన ఇద్దరు అంతర్జాతీయ ప్రయాణికుల కదలికలపై నిఘా ఉంచిన అధికారులు, వారు ఎయిర్‌పోర్టులో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న చెక్-ఇన్ లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, లోపల రహస్యంగా దాచిన హైడ్రోపోనిక్ గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. సాధారణ గంజాయి కంటే అత్యంత ప్రభావవంతంగా ఉండే ఈ రకానికి విదేశాల్లో భారీ డిమాండ్ ఉండటంతో, దీనిని హైదరాబాద్‌కు తరలించి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు నిందితులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

ఈ అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు, వారిపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ ముఠాల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వరుసగా డ్రగ్స్ పట్టుబడుతుండటంతో అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. నిందితులను విచారించడం ద్వారా ఈ డ్రగ్స్ సిండికేట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Latest