Mahaa Daily Exclusive

  విమాన ప్రయాణికులకు ‘అశనిపాతం’…

Share

  • చుక్కల్లోకి టికెట్ ధరలు.
  •  కిలోలీటర్ ఏటీఎఫ్ రూ. 2.07 లక్షలు.
  •   చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇంధన వాత.

ఢిల్లీ, మహా.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సంక్షోభం భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, విమాన టికెట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం విమాన ఇంధన ధర ఏకంగా 114.5 శాతం పెరిగి, కిలోలీటరుకు రూ. 2.07 లక్షలకు చేరుకోవడం పారిశ్రామిక వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ చరిత్రలో ఏటీఎఫ్ ధర రూ. 2 లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రభుత్వ రంగ ఇంధన సంస్థల ప్రకటన ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధరపై ఏకంగా రూ. 1,10,703 మేర పెరగడంతో మొత్తం ధర రూ. 2,07,341 వద్ద స్థిరపడింది.

సాధారణంగా విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం ఒక్క ఇంధనానికే ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో, ఇంధన ధరలు రెట్టింపు కావడంతో ఆ భారాన్ని సంస్థలు భరించడం అసాధ్యంగా మారింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న కొన్ని విమానయాన కంపెనీలు, ఈ అదనపు వ్యయాన్ని ప్రయాణికులపైకి బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. గత నెలలోనే కొన్ని సంస్థలు ‘ఫ్యూయల్ సర్‌చార్జ్’ను అమల్లోకి తెచ్చినప్పటికీ, తాజా ధరల పెరుగుదల దృష్ట్యా చార్జీలను మరింత పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధం విమానయాన రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ ప్రాంతంలోని గగనతలంపై ఆంక్షలు విధించడంతో, అంతర్జాతీయ విమానాలు తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ఇంధన వినియోగం భారీగా పెరిగి, అటు సమయం ఇటు ధనం రెండూ వృథా అవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని, కానీ ఇంధన ధరల సెగ విమాన చార్జీలను నింగికెగసేలా చేస్తోందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ స్పష్టం చేశారు. స్వదేశీ విమానయాన సంస్థలు కూడా త్వరలోనే అధికారికంగా ధరల పెంపు ప్రకటన చేసే అవకాశం ఉండటంతో, వేసవి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారి ప్రణాళికలపై ఈ పరిణామం నీళ్లు చల్లేలా ఉంది.

Latest