Mahaa Daily Exclusive

  అమరావతి అద్భుత రాజధానిగా వర్ధిల్లాలి..! రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా అభివృద్ధి చెందాలి..

Share

  • రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా అభివృద్ధి చెందాలి.
  • తెలంగాణ ప్రజల తరఫున ఏపీ సోదరులకు శుభాకాంక్షలు.
  •  కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై పార్లమెంటులో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ఢిల్లీ, మహా.

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు – 2026’పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అమరావతి అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. పార్లమెంటులో ఈ బిల్లుపై జరిగిన చర్చలో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి రాజధాని లేదని అక్కడి సోదరసోదరీమణులు బాధపడే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని, ఇవాళ కచ్చితంగా అమరావతే రాజధాని కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని, ఈ దిశగా ఒక సానుకూల వాతావరణం ఏర్పడటం ఎంతో సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా అభివృద్ధిలో పోటీపడాలని ఆకాంక్షించారు. ఏపీలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని, విభజన అనంతరం రాష్ట్రంలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఎంతోమంది త్యాగాలు, సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్నాయని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు. 1969లో ‘జై తెలంగాణ’ అని నినదించినందుకు ఏకంగా 369 మంది ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపిందని మండిపడ్డారు. మలిదశ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని, నాలుగు కోట్ల మంది ప్రజలు మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారని స్పష్టం చేశారు.

పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు తెలంగాణలో విమానాశ్రయాలు లేవని మాట్లాడటంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎనిమిది విమానాశ్రయాలు ఉంటే, తెలంగాణలో కేవలం ఒక్కటే ఉండటానికి గత కాంగ్రెస్ పాలకుల పాపమే కారణమని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుకు భూములు కేటాయించాలని కోరుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం లేఖలు రాసినా కనీస స్పందన కరువైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధి శూన్యమని, ఆ వెనుకబాటుతనమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దారితీసిందని విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తే, మోదీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. తెలంగాణలో ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని, గతంలో 2500 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులను ఈ పదేళ్లలో అదనంగా మరో 3 వేల కిలోమీటర్లు నిర్మించామని వివరించారు. రైల్వేలు, జాతీయ రహదారులు మొదలుకుని అన్ని రకాల పనులకు కేంద్రం అండదండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.

గత పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కేంద్రమంత్రి ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఆర్ఆర్ ట్యాక్స్’ పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దోపిడీపై తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏ లక్ష్యాల సాధన కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఆ లక్ష్యాలు నేరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని, వారి త్యాగాలను నవ్వులపాలు చేసే విధంగా ప్రస్తుత కాంగ్రెస్ పాలన సాగుతోందని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Latest