Mahaa Daily Exclusive

  లోక్‌సభలో ‘అమరావతి’ బిల్లుకు ఆమోదం.. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టబద్ధత..

Share

  •  ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టబద్ధత.
  •  మద్దతు పలికిన ఎన్డీయే పక్షాలు, కాంగ్రెస్.. సభ నుంచి వైసీపీ వాకౌట్.
  •  జూన్ 2, 2024 నుంచి వర్తించేలా చట్ట సవరణ
  •  నేడు రాజ్యసభ ముందుకు.. శాశ్వతంగా ముగియనున్న మూడు రాజధానుల వివాదం.

ఢిల్లీ, మహా.

 

ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026’కు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. బుధవారం సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై సుమారు రెండు గంటలపాటు వాడివేడిగా చర్చ జరిగింది. అనంతరం బిల్లు సభలో ఆమోదం పొందినట్లు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. విశేషమేమిటంటే, ఈ సవరణను 2024 జూన్ 2వ తేదీ నుంచి (రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్) వర్తించేలా బిల్లులో పొందుపరిచారు. ఈ చట్ట సవరణతో అమరావతికి ఏకైక రాజధానిగా కట్టుదిట్టమైన చట్టపరమైన భద్రత లభించనుంది.

లోక్‌సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చకు ఎన్డీయే పక్షాలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతో పాటుగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు పలికింది. అయితే, వైసీపీ ఎంపీలు మాత్రం చర్చ మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

బిల్లు ఆమోదం పొందడంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. “అమరావతి రైతుల కన్నీళ్ల పునాదుల మీద ఈ చట్టం నిర్మాణమైంది. ఇది ఆంధ్ర ప్రజల కలల రాజధాని” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి మాత్రమే శాశ్వత రాజధానిగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.

**నేడు పెద్దల సభకు.**

 

లోక్‌సభ ఆమోదం పొందిన ఈ చారిత్రక బిల్లు గురువారం (ఏప్రిల్ 2న) రాజ్యసభ ముందుకు రానుంది. ఎన్డీయే పక్షాలకు తగిన సంఖ్యాబలం ఉన్నందున పెద్దల సభలో కూడా ఇది సునాయాసంగా నెగ్గనుంది. ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఇది అధికారికంగా చట్టరూపం దాల్చనుంది. దీంతో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో తీవ్ర గందరగోళానికి దారితీసిన ‘మూడు రాజధానుల’ ప్రతిపాదనకు చట్టపరంగా శాశ్వతంగా తెరపడినట్లవుతుంది.

Latest