- మా ప్రత్యామ్నాయం ‘మావిగన్’.
- చంద్రబాబు సర్కారు తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ధ్వజం.
- లక్షల కోట్లు తగలేయడం కంటే 20 వేల కోట్లతో మచిలీపట్నం-గుంటూరు కారిడార్ అభివృద్ధి మిన్న.
- రాజధాని నిర్మాణ వ్యయాల్లో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపణ.
- అధికారంలోకి రాగానే దోపిడీపై విచారణ చేస్తామని హెచ్చరిక.
తాడేపల్లి,మహా.
రాజధాని అమరావతి పేరుతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక కుంభకోణానికి తెరతీసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా ఉన్న ఈ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ‘ప్లాన్ బి’ కింద ‘మావిగన్’ ( మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) అనే సరికొత్త ప్రతిపాదనను ఆయన తెరపైకి తెచ్చారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రామాలాడారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు 70 కిలోమీటర్లు, అక్కడి నుంచి గుంటూరు వరకు 40 కిలోమీటర్లు.. మొత్తంగా ఈ 110 కిలోమీటర్ల కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్చని జగన్ సూచించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే జాతీయ రహదారుల అనుసంధానంతో పాటు 35 నుంచి 40 లక్షల జనాభా నివసిస్తోందని ఆయన గుర్తుచేశారు. అమరావతికి ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్న రెండు లక్షల కోట్లలో కేవలం పది శాతం, అంటే రూ. 20 వేల కోట్లు వెచ్చిస్తే ఇక్కడ రింగ్ రోడ్లు, ఇతర సదుపాయాలు పూర్తయి అద్భుతమైన మెగాసిటీగా అవతరిస్తుందని వివరించారు. తన హయాంలో ప్రారంభించిన మచిలీపట్నం పోర్టు పనులు పూర్తయితే ఈ ప్రాంతానికి మరింత మహర్దశ పడుతుందన్నారు. అయితే, ఇప్పటికే అభివృద్ధి చెందిన ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకపోవడం వల్లే చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రణాళికను పక్కనపెట్టిందని ఆయన విమర్శించారు.
అమరావతిని ‘అవినీతి రాజధాని’గా అభివర్ణించిన జగన్.. నిర్మాణ వ్యయాల్లో జరుగుతున్న భారీ దోపిడీని ఎత్తిచూపారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో అత్యుత్తమ సదుపాయాలతో కూడిన నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ. 4,500 ఖర్చవుతుంటే, అమరావతిలో మాత్రం రూ. 11 వేల నుంచి 14 వేల వరకు చూపుతున్నారని మండిపడ్డారు. ఉచిత ఇసుక, భూమి, జీఎస్టీ మినహాయింపులు ఉన్నప్పటికీ ఇంత ఖర్చు ఎలా అవుతుందని నిలదీశారు. కిలోమీటరు ఫ్లైఓవర్ నిర్మాణానికి ఏకంగా రూ. 170 కోట్లు అంచనా వేస్తున్నారని, అదే తమ ప్రభుత్వంలో విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌ను కేవలం రూ. 35 కోట్లతో పూర్తి చేశామని గుర్తుచేశారు. దిల్లీలోని కొత్త పార్లమెంటు భవనం, హైదరాబాద్‌లోని సచివాలయం కంటే ఏపీ అసెంబ్లీ, హైకోర్టుల నిర్మాణ వ్యయాలు ఎక్కువగా ఉండటం అవినీతికి నిదర్శనమన్నారు. కేవలం రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస వసతులకే ఎకరానికి రూ. 2 కోట్లు ఖర్చవుతోందని ప్రభుత్వమే చెబుతోందని, లక్ష ఎకరాలకు రెండు లక్షల కోట్లు ఎక్కడినుంచి తెస్తారని, గడచిన ఏడేళ్ల చంద్రబాబు పాలనలో కేవలం రూ. 8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కుటుంబాలు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటూ ఏపీకి కేవలం ‘షటిల్ సర్వీస్’ చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. అమరావతిపై ఉన్న శ్రద్ధతో విద్యాదీవెన, ఆరోగ్యశ్రీ వంటి పేదల సంక్షేమ పథకాలను గాలికొదిలేశారని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం పేరుతో తనను, తన పార్టీని దూషించేందుకు సభను వాడుకున్నారని ఆరోపించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయాలన్నదే తమ పార్టీ విధానమని జగన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే అమరావతిలో జరుగుతున్న కుంభకోణంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.






