- కేశఖండన శాల వద్ద 15 మంది భక్తులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
- తృటిలో తప్పిన పెను ప్రమాదం.. భక్తులతో కిక్కిరిసిన అంజన్న క్షేత్రం
- నాసిరకం పనులే కారణమంటూ భక్తుల ఆగ్రహం
కొండగట్టు (జగిత్యాల): మహా.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకల వేళ తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. బుధవారం ఉదయం భక్తులు అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పించే కేశఖండన శాల వద్ద ఏర్పాటు చేసిన భారీ చలువ పందిరి ఒక్కసారిగా కూలిపోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది భక్తులకు గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హనుమాన్ చిన్న జయంతి కావడంతో కొండగట్టు భక్తులతో కిక్కిరిసిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది.
కేశఖండన శాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం అధికారులు భారీ చలువ పందిరిని ఏర్పాటు చేశారు. అయితే, బుధవారం ఉదయం భక్తులు క్యూలైన్లలో ఉన్న సమయంలో పందిరికి అమర్చిన ఇనుప పైపులు, భారీ కర్రలు ఒక్కసారిగా విరిగి భక్తుల మీద పడ్డాయి. పందిరి కింద ఉన్న భక్తులు ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీశారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వేలాది మంది భక్తులు ఉన్నప్పటికీ, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
దేవస్థాన అధికారులు పందిళ్ల ఏర్పాటులో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, నాసిరకం పనుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ఇంత బలహీనంగా పందిళ్లను ఎలా నిర్మిస్తారని అధికారులను నిలదీశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలోనూ, వారికి కనీస భద్రత కల్పించడంలోనూ దేవస్థాన యంత్రాంగం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై స్పందించిన అధికారులు దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలుస్తోంది.






