- రాజ్యసభలో గళమెత్తిన ఎంపీలు.
- కాళేశ్వరంపై కేంద్ర మంత్రుల వ్యాఖ్యలకు నిరసన.
- రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్.
- విభజన హామీల అమలులో కేంద్రం విఫలం.
- ఏడు మండలాల విలీనంపై ఎంపీల ఆవేదన.
ఢిల్లీ, మహా.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన స్పష్టమైన వైఖరిని చాటిచెప్పింది. అమరావతి నిర్మాణానికి తాము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్ రెడ్డి సభలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలన్నదే తమ నేత కేసీఆర్ ఆకాంక్ష అని, గతంలోనూ అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరై తన సంఘీభావాన్ని తెలిపారని వారు గుర్తుచేశారు. అయితే, ఇదే సమయంలో తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధులతో పాటు రుణాల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని నిర్మించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఆర్థిక సహాయం అందకపోయినా, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేశామని గర్వంగా ప్రకటించారు. అయితే, కాళేశ్వరంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వాటిని వెంటనే సభ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం 12 ఏళ్లుగా విఫలమవుతూనే ఉందని, తెలంగాణకు రావాల్సిన వాటాలను సకాలంలో ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
అంతకుముందు ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రులు హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ‘లక్ష కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి’ అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల శ్రమను అవమానించడమేనని, ఇందుకు గానూ పాటిల్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అంటూ ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, విభజన తీరుపై బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. కనీస చర్చ లేకుండా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం ద్వారా తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, అయితే విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కేంద్రం తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీకి ఇస్తున్న ప్రాధాన్యతను తెలంగాణకు కూడా ఇవ్వాలని, రెండు రాష్ట్రాల మధ్య సోదరభావం వెల్లివిరిసేలా కేంద్రం తన బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఒకవైపు రాజధాని బిల్లుకు మద్దతు తెలుపుతూనే, మరోవైపు తెలంగాణ ప్రాజెక్టుల గౌరవాన్ని కాపాడటంలో బీఆర్ఎస్ ఎంపీలు సభలో రాజీలేని పోరాటం చేశారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపడమే కాకుండా, కష్టపడి నిర్మించుకున్న ప్రాజెక్టులపై విషం చిమ్మడం కేంద్రానికి తగదని వారు హితవు పలికారు. ఈ చర్చతో రాజ్యసభలో అమరావతి బిల్లు కంటే తెలంగాణ ఆత్మగౌరవ నినాదమే మిన్నగా వినిపించింది.








