Mahaa Daily Exclusive

  తెలంగాణను దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతాం: అటెక్స్‌కాన్-2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

Share

  • దక్షిణాసియాలోనే తెలంగాణను గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతాం
  • మా డీన్ఏలోనే టెక్స్ టైల్ ఉంది
  • టెక్స్ టైల్ తెలంగాణకు పరిశ్రమ కాదు ప్రజల జీవనాధారం
  • ఇప్పటికే వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేశాం
  • తెలంగాణ రైజింగ్ లో భాగస్వాములు కండి
  • అటెక్స్‌కాన్-2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మహా : వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో తమతో భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (సిటీ) తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (అటెక్స్ కాన్ 2026) ను నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెక్స్‌కాన్-2026 నివేదికను విడుదల చేసి మాట్లాడుతూ, “అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. శతాబ్దాలుగా క‌ళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్‌ రంగాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాయి. నిజాం కాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్ నగరానికి వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలదు. టెక్స్‌టైల్స్ మా డీఎన్ఏలో ఉంది” అని గుర్తు చేశారు.

వస్త్ర పరిశ్రమలో తెలంగాణ ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలున్నాయని, దేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నామన్నారు. పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా పేరుందని, టెక్స్ టైల్ తెలంగాణకు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు, ప్రజల జీవనాధారమన్నారు. ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వరకు అనేకం ఇక్కడున్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో నైపుణ్యం ఉంది. మంచి సంకల్పం కూడా ఉంది. డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ వంటి అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని సీఎం పేర్కొన్నారు. వరంగల్‌లో కాకతీయ ప్ర‌పంచ స్థాయి మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశామని, అందులో అనేక అప్పరెల్‌ పార్కులున్నాయన్నారు. మా విజన్ తెలంగాణ రైజింగ్ – 2047 అంటూ 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యమని పునరుద్ఘాటించారు.

వస్త్ర పరిశ్రమకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుందని, అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తుందన్నారు. ప్రపంచ పోటీకి అనుగుణంగా విధానాలు అనుసరిస్తున్నామన్నారు. తెలంగాణ పత్తి పొలాల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో మేం క‌లిసి ప‌ని చేస్తున్నామంటూ మీకు విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములం అవుతామన్నారు. అందరం కలిసి, ప్రపంచాన్ని మార్చగల పూర్తి టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ భారతదేశానికి కాకుండా, ప్రపంచానికి సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతోందని, ఇటీవల నెట్ ప్లెక్స్, ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించానని సీఎం గుర్తు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయని, ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరిందన్నారు. సినిమా రంగం తమ ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ నుంచే అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తామన్నారు.

మాకు పర్యావరణ పరిరక్షణ అత్యున్నత ప్రాధాన్యమని, గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. యువతకు ముఖ్యంగా మహిళలకు శిక్షణనిచ్చి సంప్రదాయ ఆలోచనలతో పాటు ఆధునిక పరికరాలతో కలిపి డిజైన్, కట్టింగ్, స్టిచింగ్‌లో ఉపయోగించగలమన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయాలన్నది మా సంకల్పమని, తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే కాదన్నారు. విజయవంతమైన భాగస్వాములందరం కలిసి సరికొత్త భవిష్యత్తును నిర్మిద్దామని కోరారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడుదారులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సదస్సులో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అధికారులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి సందర్శించారు.

Latest