Mahaa Daily Exclusive

  కొడంగల్ గడ్డపై రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజమెత్తారు: ‘అబద్ధాల’ పల్లకీ మోస్తున్నారని విమర్శ!

Share

* సొంత గూట్లో భూములు లాక్కుంటూ..
* కేరళలో రేవంత్‌ ‘అబద్ధాల’ పల్లకీలా?
* కొడంగల్‌లో ఏ ఊరిలో రుణమాఫీ పూర్తయిందో చూపు.. రేవంత్‌కు హరీష్‌ బహిరంగ సవాల్‌!
* కమీషన్ల కోసమే కొడంగల్‌ లిఫ్ట్‌.. పాలమూరు ప్రాజెక్టును పడుకోబెట్టిన రేవంత్‌ సర్కార్‌!
* 2 లక్షల ఉద్యోగాలు బోగస్‌.. లంబాడీలకు మంత్రి పదవి ఏది?
* రేవంత్‌ రెడ్డి ఒక ‘ఐరన్‌ లెగ్‌’.. మహారాష్ట్రలో ముంచారు.. కేరళలోనూ అదే గతి!
* కొడంగల్‌ గడ్డపై హరీష్‌రావు ఫైర్!
హైదరాబాద్, మహా.
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. ఇక్కడ గిరిజనుల భూములను బలవంతంగా లాక్కుంటూ, వారిపై జైళ్లలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్న రేవంత్‌ రెడ్డి.. కేరళకు వెళ్లి తెలంగాణలో అద్భుతాలు చేస్తున్నామంటూ అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి చేతగాని హిందీ, ఇంగ్లీష్‌లో కేరళలో డైలాగులు కొడుతున్నారని, కానీ గూగుల్‌లో వెతికితే తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క గ్యారెంటీ అమలు కాలేదన్న నిజం కేరళ ప్రజలకు ఇట్టే అర్థమైపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో గ్రామసభలు పెడితే అధికారులపై, కాంగ్రెస్ నేతలపై మహిళలు తిరగబడుతున్నారని, ఇది పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా గిరిజన సంక్షేమం విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షను హరీష్‌రావు ఎండగట్టారు. లంబాడీ పోరాట సమితి దశాబ్దాలుగా పోరాడినా పట్టించుకోని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి, 6 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని, కానీ నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లంబాడీలకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ. 2730 కోట్లు చూపించి, కేవలం రూ. 52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని సంచలన లెక్కలు బయటపెట్టారు. తన మనుమడితో ఫుట్‌బాల్‌ ఆడుకోవడానికి, క్యాంప్‌ ఆఫీసుల కోసం రూ. వందల కోట్లు ఖర్చు చేసే రేవంత్‌కు.. ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి పైసలు లేవా అని నిలదీశారు.
రైతు రుణమాఫీపై రేవంత్‌ రెడ్డికి హరీష్‌రావు బహిరంగ సవాల్‌ విసిరారు. రేవంత్‌ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏ గ్రామంలో వంద శాతం రుణమాఫీ జరిగిందో చూపిస్తే తాను సిద్ధమని సవాల్‌ చేశారు. ఎన్నికల ముందు వంగి వంగి దండాలు పెట్టి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రైతులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. గత యాసంగి బోనస్‌తో పాటు మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. కేసీఆర్‌ కిట్‌, కల్యాణ లక్ష్మి, బతుకమ్మ చీరలు వంటి పథకాలను బంద్ చేసి, ఉన్నవి ఊడగొట్టడం తప్ప కొత్తగా రేవంత్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డిని ‘ఐరన్ లెగ్’గా అభివర్ణించిన హరీష్, ఆయన అడుగు పెట్టిన మహారాష్ట్రలో కాంగ్రెస్ మునిగిపోయిందని, రేపు కేరళలోనూ అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌ రెడ్డి కమీషన్ల కక్కుర్తికి పాల్పడుతున్నారని హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనబెట్టి, కేవలం కమీషన్ల కోసమే రూ. 4500 కోట్లతో కొడంగల్‌ లిఫ్ట్‌ను తెరపైకి తెచ్చారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు వచ్చే అవకాశం ఉన్నా, కేసీఆర్‌కు పేరు వస్తుందనే కుట్రతో దాన్ని ఆపేశారని మండిపడ్డారు. కడవల కాలువ ద్వారా తక్కువ ఖర్చుతో నీళ్లు తెచ్చే మార్గం ఉన్నా, వేల కోట్లు దండుకోవాలని రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కమీషన్ల వేట ఆపి, పాలమూరు ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులను ఆదుకోవాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలే రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

Latest