Mahaa Daily Exclusive

  నోరూరించే మామిడి.. తస్మాత్ జాగ్రత్త!

Share

* కృత్రిమ ఫలాలపై హైదరాబాద్ సీపీ హెచ్చరిక.
* మెరిసే పండు వెనుక విషపు కోరలు.
* కాల్షియం కార్బైడ్‌తో ప్రజారోగ్యానికి పెను ముప్పు.
* కల్తీ కనిపిస్తే ‘100’కు సమాచారం ఇవ్వండి.. సజ్జనార్ పిలుపు.
హైదరాబాద్, మహా.
వేసవి తాపం మొదలైందంటే చాలు.. మార్కెట్లలో పండ్ల రారాజు మామిడి సందడి మొదలవుతుంది. అయితే, నిగనిగలాడుతూ పసిడి వర్ణంతో కళ్లకు ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. కాయ కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమంగా పండించిన మామిడి పండ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకున్నట్లేనని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నట్లు పోలీసు యంత్రాంగం గుర్తించింది. రోడ్ల పక్కన బండ్ల మీద అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి మోసపోవద్దని సీపీ సూచించారు. సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదని, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయని ఆయన వివరించారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోందని సజ్జనార్ వెల్లడించారు. కల్తీ మామిడి పండ్ల విక్రయాలపై హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండ్ల రూపం చూసి మోసపోకుండా, వాటి సహజత్వాన్ని గుర్తించాలని కోరారు. ముఖ్యంగా అసాధారణ రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలని సూచించారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబ‌ర్ 8712661212కు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని సీపీ సజ్జనార్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు.