Mahaa Daily Exclusive

  మాయగాళ్ల మోసం.. ప్రాణం తీసిన ‘నకిలీ’ పత్రాల ఉచ్చు..! అమీర్‌పేటలో స్క్రాప్ వ్యాపారి ఆత్మహత్య..

Share

  • అమీర్‌పేటలో స్క్రాప్ వ్యాపారి ఆత్మహత్య.
  • రూ. 10 కోట్లకు పైగా మునిగానని ఆవేదన.
  • భార్యకు లొకేషన్ పంపి బలవన్మరణం.. కారులో లభించిన ప్రవీణ్ రెడ్డి సూసైడ్ నోట్.

హైదరాబాద్, మహా.

భాగ్యనగరంలో మోసగాళ్ల చేతిలో చిక్కి ఆర్థికంగా కుంగిపోయిన ఓ వ్యాపారి చివరకు తనువు చాలించిన విషాద ఘటన అమీర్‌పేటలో వెలుగుచూసింది. నకిలీ పత్రాలతో ఇల్లు అమ్మి కొందరు కేటుగాళ్లు చేసిన మోసం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (42) అనే స్క్రాప్ వ్యాపారి, తనను నమ్మించి గొంతు కోసిన వారి వివరాలను సూసైడ్ నోట్‌లో పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోట్లాది రూపాయల మేర వ్యాపారంలో నష్టం రావడం, కొన్న ఇల్లు కూడా వివాదంలో చిక్కుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వనస్థలిపురంలో ఒక ఇంటిని రూ. 3.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే, ఆ ఇల్లు నకిలీ పత్రాలతో తనకు అంటగట్టారని, తనను దారుణంగా మోసం చేశారని ఆయన ఆరోపించారు. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా, తన స్క్రాప్ వ్యాపారానికి సంబంధించి వివిధ వ్యక్తుల నుంచి సుమారు రూ. 6.8 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని, వారు కూడా తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా పది కోట్ల రూపాయలకు పైగా తనను నష్టపరిచారని, ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేక ప్రాణాలు వదులుతున్నట్లు తన భార్యకు రాసిన లేఖలో వివరించారు.

బుధవారం బేగంపేటలోని రెనెక్సా టవర్స్ సమీపంలో ఒక నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకున్న ప్రవీణ్, అక్కడ ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందారు. ఆత్మహత్యకు ముందు తన కారులో సూసైడ్ నోట్ ఉంచి, భార్యకు తన లొకేషన్‌ను సెల్‌ఫోన్ ద్వారా షేర్ చేశారు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి మృతికి కారణమైన మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సామాన్య వ్యాపారిని నమ్మించి కోట్లకు ముంచిన ఆ మాయగాళ్లు ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Latest