Mahaa Daily Exclusive

  ఆయుర్వేద డాక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ వైద్య సేవా పురస్కారం.!.

Share

  • రవీంద్రభారతి వేదికగా మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఘన సత్కారం.
  • పంచకర్మ చికిత్సలో విశేష సేవలకు గుర్తింపు.. ఆయుర్వేద రంగానికి దక్కిన గౌరవం.

హైదరాబాద్, మహా.

 

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి పంచకర్మ నిపుణులు , ఆయుర్వేద మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి నివేదిక’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయనకు రాష్ట్ర స్థాయి “ఉత్తమ వైద్య సేవా పురస్కారాన్ని” అందజేసింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరియు ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చంగ్దు చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఆయుష్ విభాగంలో ఆయన అందిస్తున్న నిరుపమాన సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఈ పురస్కారంతో ఆయనను గౌరవించడం విశేషం.

డాక్టర్ ప్రవీణ్ కుమార్ కేవలం రోగనిర్ధారణ చేసి మందులు ఇచ్చే వైద్యుడిగానే కాకుండా, రోగులతో ఆత్మీయంగా సంభాషించే మానవత్వం గల వైద్యుడిగా పేరుగాంచారు. రోగుల జీవనశైలిని కూలంకషంగా అర్థం చేసుకుంటూ, వారి బాధలను ఓపికగా వినడం ద్వారానే సగం వ్యాధి నయమవుతుందని ఆయన బలంగా నమ్ముతారు. ప్రాచీన ఆయుర్వేద చికిత్సా పద్ధతి అయిన పంచకర్మను ఆధునిక జీవన అవసరాలకు అనుగుణంగా మలుస్తూ వందలాది మంది రోగులకు ఆయన కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఎంతో కాలంగా దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న వారు సైతం ఆయన వద్ద చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే ఆయుర్వేద వైద్య వ్యవస్థలో ఆయనను ఒక కలికితురాయిగా రోగులు కొనియాడుతుంటారు.

ఒకవైపు రోగులకు నిరంతర సేవలు అందిస్తూనే, మరోవైపు ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా భావి వైద్యులను తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయుర్వేదం అనేది కేవలం మూలికల వైద్యం మాత్రమే కాదని, అది మనిషిని శారీరకంగా, మానసిక సమగ్రంగా స్వస్థపరిచే గొప్ప విజ్ఞానమని ఆయన విద్యార్థులకు బోధిస్తుంటారు. పంచకర్మ చికిత్స ద్వారా శరీరం మరియు మనసు రెండూ పునరుత్తేజం పొందుతాయని, అదే మన ప్రాచీన వైద్య వారసత్వమని ఆయన పదేపదే చెబుతుంటారు. తన విధులను బాధ్యతగా కాకుండా ఒక యజ్ఞంలా భావించి పనిచేస్తున్న ఆయన కృషికి ఈ అవార్డు సముచిత గౌరవంగా నిలిచింది.

పురస్కారం అందుకున్న అనంతరం డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుర్వేదం పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, మన దేశపు ప్రాచీన వైద్య విధానాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అందించిన ఈ ప్రోత్సాహం తనతో పాటు ఎంతో మంది ఆయుర్వేద వైద్యులకు స్ఫూర్తినిస్తుందని, భవిష్యత్తులో మరింత మందికి మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు అవార్డు దక్కడం పట్ల ఆయుర్వేద వైద్య సంఘాలు మరియు తోటి వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest