Mahaa Daily Exclusive

  తెలంగాణ పోరాట యోధుడు టైగర్ నరేంద్ర ఆశయాలే మాకు స్ఫూర్తి: రామచందర్ రావు నివాళి

Share

అలె నరేంద్ర ఆశయాలే మాకు స్ఫూర్తి.
* టైగర్ నరేంద్రకు రామచందర్ రావు నివాళి.
హైదరాబాద్, మహా.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి ‘టైగర్’ అలె నరేంద్ర 12వ వర్ధంతి సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ ఎన్. రామచందర్ రావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ చరిత్రలోనూ, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలోనూ అలె నరేంద్ర గారు పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ గడ్డపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అలె నరేంద్ర అని, మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా , కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన సాగించిన పోరాటం, ఉద్యమకారుల్లో నింపిన ఉత్తేజం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన అన్నారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, కార్మిక నాయకునిగా కాగజ్‌నగర్, సిర్పూర్ పేపర్ మిల్లుల కార్మికుల హక్కుల కోసం అహోరాత్రులు శ్రమించిన గొప్ప మనసు ఆయనదని గుర్తు చేసుకున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన రాజీలేని పోరాటం నేటికీ అనేకమందికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.
పాతబస్తీలో హిందువుల రక్షణ కోసం నరేంద్ర చేసిన కృషిని ఈ సందర్భంగా రామచందర్ రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంను ప్రోత్సహిస్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న క్లిష్ట కాలంలో, నరేంద్ర భాయీసాబ్ హిందువులకు అండగా నిలబడ్డారని, పాతబస్తీలో ధైర్యాన్ని నింపిన ధీశాలి ఆయన అని కొనియాడారు. దేశం కోసం, హిందూ ధర్మం కోసం, సంస్కృతి పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన వెలకట్టలేనిదని అన్నారు.
నరేంద్ర ఆశయాలు, ఆశీస్సులు నేటికీ హైదరాబాద్‌లోని వేలాది మంది కార్యకర్తలకు స్ఫూర్తినిస్తున్నాయని రామచందర్ రావు పేర్కొన్నారు. ఆయన జ్ఞాపకాల నుండి పొందిన బలంతోనే నేడు ఎంతోమంది కార్యకర్తలు నిబద్ధతతో పార్టీ కోసం పని చేస్తున్నారని చెప్పారు. నరేంద్ర లోని ధైర్యం, పోరాట పటిమ మరియు అంకితభావం ప్రతి బీజేపీ కార్యకర్త అలవర్చుకోవాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

Latest