Mahaa Daily Exclusive

  పరిగిలో భూసేకరణ సెగలు: కలెక్టర్‌తో కవిత వాగ్వాదం.. భూములిచ్చే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

Share

పరిగిలో భూసేకరణ సెగలు.
* కలెక్టర్‌తో కవిత వాగ్వాదం.
* ‘ఫోన్‌’లోనే వాడీవేడీ చర్చ.
* భూములిచ్చే ప్రసక్తే లేదని స్పష్టీకరణ.
* ‘ఆర్డీవో’ ప్రతిపాదనను తిరస్కరించిన వైనం.
* ధర్నా విరమించేది లేదని హెచ్చరిక..
* పరిగిలో కొనసాగుతున్న ఉద్రిక్తత.

వికారాబాద్‌, మహా.
వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రతిపాదిత పారిశ్రామిక కారిడార్ భూసేకరణ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి దారితీసింది. పారిశ్రామికీకరణ పేరుతో తమ జీవనాధారమైన సాగుభూములను లాక్కోవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళన బుధవారం ఉద్రిక్త రూపం దాల్చింది. రైతులకు మద్దతుగా రంగంలోకి దిగిన బీఆర్‌ఎస్ నేత కవిత, అధికారుల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు, కవితకు మధ్య ఫోన్‌లో జరిగిన సంభాషణ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ ప్రాణప్రదమైన భూములను ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారని, వారి బాధలను ఏసీ గదుల్లో కూర్చుని కాకుండా నేరుగా క్షేత్రస్థాయికి వచ్చి వినాలని కవిత కలెక్టర్‌కు స్పష్టం చేశారు.
ధర్నాను విరమింపజేసే క్రమంలో కలెక్టర్ స్వయంగా కవితకు ఫోన్ చేసి చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అయితే కవిత తన పట్టు వీడలేదు. భూములు కోల్పోతున్న రైతుల ఆవేదనను స్వయంగా అధికారులే వినాలని, అప్పుడే వారికి ఉన్న భయాందోళనలు అర్థమవుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ చర్చల సందర్భంగా రైతులతో మాట్లాడేందుకు ఆర్డీవోను పంపిస్తామని కలెక్టర్ ప్రతిపాదించగా, కవిత ఆ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. “జిల్లా యంత్రాంగంపై రైతులకు నమ్మకం కలగాలంటే జిల్లా ఉన్నతాధికారిగా మీరే స్వయంగా వచ్చి రైతులకు భరోసా ఇవ్వాలి” అని ఆమె డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు నిరసనను విరమించే ప్రసక్తే లేదని ఆమె భీష్మించుక కూర్చున్నారు.
కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో పరిగి ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. భూసేకరణ ప్రక్రియను అడ్డుకోవడానికి రైతులు కంకణం కట్టుకోగా, వారికి రాజకీయ మద్దతు తోడవ్వడంతో ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడింది. రైతు గళం మరింత బలంగా విన్పిస్తున్న తరుణంలో, జిల్లా యంత్రాంగం తదుపరి ఎలాంటి అడుగు వేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సామాన్య రైతుల కడుపు కొట్టే ఏ నిర్ణయానికైనా అడ్డుగా నిలుస్తామని కవిత ఈ సందర్భంగా హెచ్చరించారు.

Latest